Minister Damodar Rajanarsimha On DA : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందించడమే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. దేశ, సమాజ నిర్మాణం టీచర్లపై ఉందని గుర్తుచేశారు. అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని ఆయన వివరించారు. ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం తరఫున హెల్త్ కార్డులను అందజేస్తామని వెల్లడించారు. నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
స్కూళ్లలో మౌలికవసతుల కల్పనకు కృషి :త్వరలో 6వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ఫండ్స్‌తో అందోల్ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అందోల్ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూను, మూడు పాలిటెక్నిక్ కళాశాలలను తెచ్చామన్న ఆయన నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వివరించారు.
రూ.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి :అందోల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వెల్లిడంచారు. రూ.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మెడికల్ కళాశాలల కోసం గత పాలకులు జీవోలు ఇచ్చి రాజకీయంగా వాడుకుంటున్నారు. జీవోలు ఇస్తే మెడికల్ కాలేజ్‌లు వస్తాయా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 మెడికల్ కాలేజ్‌లకు అనుమతులు సాధించామన్నారు.