LB Nagar To Hayathnagar Metro Expansion :హయత్‌నగర్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు, ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. వాళ్లు నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలి అన్నా బస్సు, ఆటోలోనే వెళ్లాలి. లేదా ఎల్బీ నగర్ వరకు వచ్చి అక్కడి నుంచి మెట్రో వెళ్లాల్సి వస్తుంది. హయత్‌నగర్ నుంచి ఎల్బీ నగర్‌కు రావాలన్నా చాలా సమయం పడుతుంది. కారణం ట్రాఫిక్. నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. అలాంటి వారికి శుభవార్త. ఎందుకంటే మెట్రో రాకతో వారి ప్రయాణం సులభతరం కానుంది. హయత్‌నగర్ నుంచి ఐటీ కారిడార్ వరకు మెట్రో అనుసంధానం ఏర్పడనుంది.
హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటరుకు కాస్త అటుఇటుగా ఒక స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా కారణంగా మెట్లో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపున్నా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు ఫైనల్ మ్యాప్ ఇచ్చారు.