Megastar ChiranjeeviResponse on Minister Konda Comments :బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో సమంత, అక్కినేని నాగచైతన్య విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, నాని సహా చాలా మంది మంత్రి వ్యాఖ్యలను ఖండించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
"గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేసి తక్కువ సమయంలో వార్తల్లో నిలిచేందుకు, సినీ కుటుంబాలకు చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. మా సినీ కుటుంబసభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపై వ్యతిరేకిస్తాం. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం రాజకీయంగా మంచిది కాదు. సమాజ అభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలతో వారు తమ స్థాయిలను దిగజార్చుకోవద్దు. గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉండేవారు, రాజకీయ నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలి" అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
- "వ్యక్తిగత విషయాలను రాజకీయంగా వాడుకోవడం చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. మా సినిమా కుటుంబం మొత్తం పరస్పరం సహకరించుకుంటాం. సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవరికీ ఉపయోగం ఉండదు. ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లు, రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి." - హీరో వెంకటేశ్
- "సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి." - అల్లు అర్జున్, సినీనటుడు
- "సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల కారణంగా సినిమా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరం. మా పరిశ్రమ ఇతర రంగాల మాదిరిగానే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తోంది. ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం అవాస్తవ కథనాలను వాడటం చాలా నిరాశ కలిగించింది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం." - మంచు విష్ణు, మా అధ్యక్షుడు