Medigadda Barrage Temporary Repairs 2024 :కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సూచించింది. ఏడో బ్లాక్‌లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్‌ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివారం 20వ గేట్ కటింగ్ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్‌లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు సమాచారం. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
రోజుకో సమస్య : మేడిగడ్డ ఆనకట్ట తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేట్ ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తమవుతూనే, ఏడో బ్లాక్ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు. మరోవైపు శుక్రవారం పనులు చేస్తున్న క్రమంలో 20వ పియర్ వద్ద భారీ బుంగను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి ఇసుక, ఇసుక బస్తాలు వేసి పూడ్చివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పూర్తిస్థాయి పరిశీలన, బుంగల సమస్య తీరేవరకు ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పలు చిన్న చిన్న బుంగలు ఏర్పడగా, వాటిని సైతం పూడ్చివేశారు. ఆనకట్ట దిగువన సీసీ బ్లాక్‌ల ఏర్పాటు పనులు కొనసాగిస్తున్నారు. ఏడో బ్లాక్ ప్రాంతంలోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు పనులు చేపట్టారు.
అనధికార ఆంక్షలు! : మేడిగడ్డ ఆనకట్ట దెబ్బతిన్న రోజు నుంచి మీడియా, సామాన్య ప్రజలు లోపలికి వెళ్లకుండా ఆంక్షలు ఉండగా, కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత వాటిని ఎత్తివేసింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అనధికార ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా నిర్మాణ సంస్థ ప్రైవేట్ సిబ్బంది ద్వారా కట్టడి చేస్తోంది. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన, ఆదేశాలు లేనప్పటికీ మేడిగడ్డ ప్రాంతంలో అనధికార ఆంక్షలు సాగుతున్నాయి.