Medigadda Barrage Damage Issue Updates : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. యజమాని ప్రభుత్వం కాదు, గుత్తేదారు అన్నట్లుగా ఇంజినీర్లు వ్యవహరించినట్లు గుర్తించారు. 2019లో ఆనకట్టను ప్రారంభించిన నాలుగు నెలలకే సమస్యలు తలెత్తాయి. ఐదేళ్లుగా నిర్వహణా సక్రమంగా లేదని బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పేర్కొంది. ఈ మేరకు విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ప్రాథమిక నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అందించినట్లు తెలిసింది. మేడిగడ్డ నిర్మాణం పూర్తై ప్రారంభించిన రెండేళ్ల తర్వాత అంచనా విలువ రూ.1,353 కోట్లు పెంచడం సహా ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్ ఏది అడిగితే అది ఇచ్చారని నిర్ధారించారు.
Vigilance Inquiry on Medigadda Barrage :మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్ మొదలు, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలు ఉన్నట్లు నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు. ఆనకట్ట నిర్మాణ గడువు ఆరుసార్లు పొడగించడం సహా బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు
Medigadda Barrage Damage Issue :ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తైన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ రెండేళ్లు. ఆ తర్వాత మూడేళ్లపాటు నిర్వహణ గుత్తేదారే చేయాలి. అయితే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఎప్పుడు మొదలైందో, నిర్వహణ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పని పూర్తైనట్లు మూడుసార్లు ధ్రువీకరణ పత్రాలిచ్చారని నిర్ధారించారు. ఓవైపు పని పూర్తైనట్లు ధ్రువపత్రం ఇస్తూనే ఇంకోవైపు ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, బ్యారేజీకి పలు చోట్ల నష్టం వాటిల్లిందని గుత్తేదారు సంస్థకు లేఖలు రాయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం గుర్తించింది.