ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రగ్‌ పెడ్లర్‌ మస్తాన్‌ సాయికి 14 రోజుల రిమాండ్- వెలుగులోకి విస్తుపోయే నిజాలు - Drug Peddler Mastan Sai Arrested

Drug Peddler Mastan Sai Arrested: డ్రగ్స్‌ కేసులో గుంటూరు నగరానికి చెందిన రావి సాయి మస్తాన్‌రావును విజయవాడ సెబ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన హీరో రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలో సాయి మస్తాన్‌రావు పేరు తెరపైకి వచ్చింది. సాయిపై డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు చర్చనీయాంశమైంది.

Drug Peddler Mastan Sai Arrested
Drug Peddler Mastan Sai Arrested (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 10:48 AM IST

Drug Peddler Mastan Sai Arrested :విజయవాడలో కలకలం రేపిన ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడ్ని సెబ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రెండు నెలలు పరారీలో ఉన్న సాయిని గుంటూరులో అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. సాయి హిమాచల్ ప్రదేశ్​లో చదువుకునేటప్పుడు డ్రగ్స్​కు అలవాటయ్యాడు. దిల్లీలో తక్కువ ధరకు దొరుకుతుందని ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో గోపీచంద్ అనే వ్యక్తిని దిల్లీ పంపారు.

గుంటూరు నగరానికి చెందిన యనమల గోపీచంద్‌ దిల్లీ వెళ్లి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ఈ ఏడాది జూన్ 3న విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా ముందస్తు సమాచారం ఆధారంగా సెబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కోసం రైల్వే స్టేషన్‌ బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరు నగరానికి చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్‌ ఖాజా మొహిద్దీన్, షేక్‌ నాగూర్‌ షరీఫ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ముగ్గురిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతో రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం వీరు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. నిందితుల్లో ఖాజా మొహిద్దీన్, నాగూర్‌ షరీఫ్‌ గుంటూరులోని ప్రముఖ బిర్యానీ హోటల్‌ నిర్వాహకులు. నిందితులను సెబ్‌ పోలీసులు విచారించగా వీరి స్నేహితుడైన రావి సాయి మస్తాన్‌రావు ఇచ్చిన చిరునామా ఆధారంగా గోపీచంద్‌ దిల్లీ వెళ్లి తెచ్చినట్లు చెప్పాడు. దీంతో విజయవాడ వెస్ట్‌ సెబ్‌ పోలీసులు ఏ5గా సాయి పేరును చేర్చారు.

డ్రగ్స్ సరఫరా కేసులో గుంటూరుకి చెందిన రావి మస్తాన్ సాయి అరెస్టు - Mastan Sai Arrested in drugs case

14 రోజుల రిమాండ్‌ : సాయి మస్తాన్‌రావు కోసం సెబ్‌ పోలీసులు గాలిస్తుండటంతో వారికి చిక్కకుండా హైదరాబాద్, గుంటూరుల్లో మకాం మార్చాడు. ఎట్టకేలకు గుంటురు జీటీ రోడ్డులోని మస్తాన్‌ దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకుని విజయవాడ వెస్ట్‌ సెబ్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తన బృందంతో వెళ్లి అరెస్టు చేశారు. విజయవాడలోని ఆరో ఎంఎం కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. సాయి బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సాయి తండ్రి రామ్మోహన్‌రావు మస్తాన్‌ దర్గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏటా జరిగే ఉరుసు వేడుకలకు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పోలీసు అధికారులను సాయి తండ్రి ఆహ్వానించేవారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు, సోదరుడి కుమారుడితో కూడా సాయికి సంబంధాలు ఉన్నాయి. సాయి ఇంజినీరింగ్‌ చదివే సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు సమాచారం. అప్పటి నుంచే డ్రగ్స్‌ సరఫరాదారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు-హైదరాబాద్‌ మధ్య తిరుగుతూ సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాల పెంచుకున్నాడు. నిందితుడిని సెబ్‌ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్‌ సరఫరాదారులతో ఉన్న సంబంధాలు? తిరిగి ఎవరెవరికి అందించేవాడు? అన్న విషయాలను రాబట్టినట్లు సమాచారం. వివరాలను సెబ్‌ పోలీసులు వెల్లడించడం లేదు.

గోవాలోని నైజీరియన్లతో లింకులు :లావణ్యను హోటల్‌ గదిలో పెట్టి వేధించటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. యువతులను ఈవ్‌టీజింగ్‌ చేసిన సంఘటనపై గుంటూరు పట్టాభిపురం స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. గత ఏడాది సెప్టెంబరు 13న రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ, మోకిల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో డ్రగ్స్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి, అనూరాధ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ కేసులోనే ఏ4గా సాయి మస్తాన్‌రావు ఉన్నాడు. అప్పట్లో కేవలం డ్రగ్స్‌ వినియోగదారుడు అని నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే అనురాధకు గోవాలోని నైజీరియన్లతో లింకులు ఉన్నాయని, వారి సాయంతోనే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె అరెస్టు కావడంతో సాయి మస్తాన్‌.. ఆమె పరిచయస్థుల ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తర్వాత.. వాటిని వినియోగించడంతో పాటు ఇతరులకూ అమ్ముతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - ఆత్మహత్య చేసుకుంటున్నా'- తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates

ABOUT THE AUTHOR

...view details