Massive Theft In Businessman House :హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హిమాయత్‌నగర్ మినర్వా హోటల్ గల్లీలోని ఇంట్లో సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను నిందితులు చోరీ చేశారు. ఇంటి యజమాని అభయ్ కేడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ముగించారు.
దోపిడీలకు అడ్డొస్తే హత్యే : నిందితుల నుంచి రూ.3 కోట్ల విలువైన బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్వాడి, జైన్లలో ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నిందితులు వారి ఇంట్లో పనివాళ్లలాగా చేరుతున్నారని తెలిపారు. నిందితులపై 2024 జనవరిలో వృద్ధురాలిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డ నేరం కేసులు నమోదయ్యాయని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. నిందితుల పేర్లు వరుసగా మొల్హూ, శుషీల్ (బిహార్), బసంతి ఆర్తి (బంగాల్)గా ఉన్నాయి. అదను చూసి దోపిడీలకు పాల్పడుతూ అడ్డొస్తే హత్య నిందితులు హత్య చేస్తున్నారని వెల్లడించారు.
"హైదరాబాద్ కమిషనరేట్‌లో వేగవంతంగా అన్ని విభాగాలను అనుసంధానిస్తూ ఈ కేసును దర్యాప్తు చేసిన ఉదాహరణ ఇది. టాస్క్‌ఫోర్స్‌ను ఇందులో చేర్చడం వల్ల ఈ కేసు వేగంగా పరిష్కారం అయ్యింది. నిందితులు రూ.3 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించారు. అది మార్కెట్లో 5 కోట్ల కన్నా ఎక్కువ విలువను కలిగి ఉంది. ఇంత భారీ దొంగతనాన్ని వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాం" -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
అసలేం జరిగిందంటే : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఫిబ్రవరి 12న భారీ చోరీ జరిగింది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితులను నాగ్‌పుర్ సమీపంలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.