Fire Accident in Nellore district: వైద్యారోగ్య శాఖ కార్యాలయ భవనం వద్ద భారీగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. భారీగా ఎగసిపడిన మంటల వల్ల కార్యాలయంలో కొన్ని వస్తువులు నాశనం అయ్యాయి. ఒక్క సారిగా అగ్నికీలలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇదీ జరిగింది: నెల్లూరు నగరంలోని జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం పక్కనే ఉన్న భవనంలో భారీగా మంటలు అంటుకున్నాయి. పాత భవనంలోని మలేరియా శాఖకు చెందిన పరికరాలు కొన్ని మంటల్లో దగ్ధం అయ్యాయి. దోమలకు పిచికారీ చేసే ఆయిల్ కు నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మలేరియా శాఖకు చెందిన భవనంలో ఐదు ట్యాంకుల ఆయిల్ మండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. నగరంలో కిలోమీటరు దూరం వరకు ఈ పొగలు వ్యాపించి చుట్టు పక్కల ఇళ్లవారు సైతం ఇబ్బందులు పడ్డారు. ఎవరో కావాలనే నిప్పుపెట్టి ఉంటారనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో దస్త్రాలు ఏమీ లేవని జిల్లా అధికారి పెంచలయ్య తెలపడం గమనార్హం.