ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోజుకో మార్గంలో మీ చుట్టూ సైబర్​ వల- అలా చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ - CYBER CRIME

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 10:04 AM IST

Cyber Crimes in Telugu States: సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలతో జనాన్ని దోచేస్తున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును చిటికెలో కొట్టేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని నమ్మించి, జేబులు గుల్లచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారో, వారి బారి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

Cyber Crimes in Telugu States
Cyber Crimes in Telugu States (ETV Bharat)

Cyber Crimes in Telugu States :అచ్చంగా వారు ఈడీ లేదా సీబీఐ అధికారిలా వ్యవహరిస్తారు. మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్‌కాల్‌ చేశారేమో అన్నట్లుగా నమ్మే విధంగా నటిస్తారు. మోసగాళ్లనే అనుమానమే కలగకుండా ప్రవర్తిస్తారు. అదంతా నిజమని నమ్మితే ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. మీ బ్యాంకుఖాతా నగదంతా ఖాళీ అయిపోయినట్లే.

బ్యాంకు అధికారులమంటూ ఫోన్‌ చేస్తారు. కొన్ని వివరాలు చెబుతూ అవన్నీ మీవేనా అని ఆరా తీస్తారు. నిజంగానే బ్యాంకు సిబ్బందే కాల్‌ చేశారేమోనని నమ్మి వారు అడిగినవన్నీ చెబితే క్షణాల్లో మీ ఖాతాలోని డబ్బులంతా ఊడ్చేస్తారు. ఇలా సైబర్‌ నేరగాళ్లు గంటకో మోసం పూటకో వేషం అన్నట్లుగా పేట్రేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు నేర విధానాలు మార్చేసుకుంటూ ప్రజల మీద వల విసురుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవడమే నివారణ మార్గం : అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్‌ చేయించి, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టించి యువతను ఉచ్చులోకి లాగుతారు. అనంతరం అందినకాడికి దోచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా సైబర్‌ మోసాలతో వేలాది మంది నష్టపోతున్నారు. ఇలాంటి నేరాలపై అవగాహన, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి నివారణ మార్గమని పోలీసు అధికారులు, సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

కలెక్టర్​ పేరుతోనే ఫేక్ అకౌంట్-ఆపై డబ్బులు పంపాలంటూ మెసేజ్​లు - cyber fraud with collector name

మోసపోయిన ప్రైవేటు ఉద్యోగి : ముంబయిలోని కొరియర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్‌ చేస్తారు. మీ పేరుతో విదేశాల నుంచి ఒక పార్శిల్‌ వచ్చింది. అందులో ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పాస్‌పోర్టులు ఉన్నాయని భయపెడతారు. అవి మీకు ఎలా వచ్చాయో చెప్పాలని బెదిరింపులకు దిగుతారు. ఇదే తరహాలో తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్ల ఖాతాలకు రెండు విడతల్లో 32 లక్షల రూపాయలు బదిలీ చేసి ఇదే తరహాలో మోసపోయారు.

సైబర్‌ నేరాల తీరు ఎలా ఉంటోంది :సరి కొత్త మోసాలతో జనాన్ని దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. పోలీసులు, దర్యాప్తు సంస్థల అధికారులమని బెదిరించి, ఈ-కేవైసీ (E-Kyc)ల పేరిట లింకులు పంపించి, క్రిప్టో కరెన్సీ (Crypto Currency)తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని చెప్పి ఖాతాలు ఖాళీ చేస్తారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ సైబర్‌ నేరాల తీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం!

అశ్లీల వెబ్‌ సైట్లు - మాదక ద్రవ్యాల ఎర : 'మీ పేరుతో విదేశాలకు అక్రమంగా డబ్బులు తరలుతున్నాయి. మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. మిమ్మల్ని విచారించాలి' అంటూ ఫోన్ చేస్తారు. వాటితో తమకేం సంబంధం లేదంటే విచారణ పేరిట వీడియో కాల్‌ చేస్తారు. మీ ఇంటి బయటే ఈడీ, సీబీఐ అధికారులున్నారని, అరెస్టు చేసేస్తారని భయాందోళనకు గురిచేస్తారు. బ్యాంకు ఖాతాలు సహా ఇతర వివరాలు తీసుకుని వాటిలో నుంచి నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటారు.

'మీరు అశ్లీల వెబ్‌ సైట్లు చూస్తున్నారు. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వారంట్‌తో వస్తున్నాం' అని బెదిరించి డబ్బులు కాజేస్తున్న ఘటనలూ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇటీవల ఈ తరహా నేరాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

సైబర్​ వలలో చిక్కిన మాజీ ఎమ్మెల్యే- సీబీఐ అధికారులమంటూ రూ.50లక్షలకు టోకరా - cyber Crime

ఈకేవైసీ పేరుతో ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు :'బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం. మీ ఈకేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే మీ ఖాతా నిలిచిపోతుంది. మీ ఫోన్‌కు ఓ లింకు పంపాం. అందులో మీ ఈకేవైసీ వివరాలన్నీ వెంటనే అప్‌డేట్‌ చేయ్యండి' అని ఫోన్‌ కాల్‌లో కంగారు పెడతారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే మీ కంప్యూటర్‌, ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఈకేవైసీ అప్‌డేట్‌ కోసం ఆ లింక్‌లో డెబిట్, క్రెడిట్‌ కార్డులు, వాటి వెనక ఉండే సీవీవీ నంబర్‌ నమోదు చేశారా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్లే. వెంటనే ఈ-కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే మీ సిమ్‌ బ్లాక్‌ అయిపోతుందని లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.

  • ఏ బ్యాంకూ ఫోన్‌ చేసి ఈకేవైసీ వివరాలు అడగదు.
  • లింక్‌ పంపించి అందులో ఈకేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలని ఎవరైనా కాల్‌ చేస్తే అది మోసమేనని తెలుసుకోవాలి.
  • మీ క్రెడిట్‌, డెబిట్ కార్డుల వివరాలు, సీవీవీ నంబర్లు అడిగినా ఎవ్వరికి చెప్పకండి.
  • అపరిచితులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దు.

బ్లాక్‌ ట్రేడింగ్‌, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడుల పేరిట :'బ్లాక్‌ ట్రేడింగ్‌, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టండి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో కళ్లు చెదిరే డబ్బు పొందండి' అంటూ సంబంధిత వాట్సప్‌ గ్రూపుల్లో మీ నంబర్‌ చేరుస్తారు. వాటివైపు ఆకర్షించి భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా చేస్తారు. మీ పెట్టుబడి కంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు, అదంతా క్రిప్టో కరెన్సీ రూపంలో మీ ఖాతాలో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తారు. ఆదాయం విత్‌డ్రా కావాలంటే మరికొంత చెల్లించాలంటూ ఇంకా ఉచ్చులోకి లాగుతారు. అవి చెల్లిస్తున్న కొద్దీ మరింతగా దోచేస్తారు.

"సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతుంటారు. అలాంటి వాటి పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుంచి మాట్లాడుతున్నామని చెబితే అది కచ్చితంగా మోసమేనని గుర్తించాలి. ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాలని, ఇతర వివరాలతో ఫోన్లకు పంపించే లింకులను క్లిక్‌ చేయకండి." - నల్లమోతు శ్రీధర్, సైబర్‌ నిపుణుడు

ఫిర్యాదు ఇలా చేయండి :

  • National Cybercrime Portal :కేంద్ర హోం శాఖ నిర్వహించే జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి.
  • Cyber ​​Crime Toll Free Number :సైబర్‌ నేరాల బారినపడ్డ బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
  • మీ సమీపంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)ల్లోనూ ఫిర్యాదు చేయొచ్చు.

అధికారులూ పారాహుషార్- మీ ఫొటో ముందుపెట్టి అడ్డంగా దోచేస్తున్న సైబర్​ నేరగాళ్లు - FAKE DP CYBER CRIME

ABOUT THE AUTHOR

...view details