Manyam District Hospital Problems to Patients : పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికం ఉంటుంది. ఇక్కడ వంద పడకలు ఉన్నా, 250మంది వరకు వివిధ వైద్య విభాగాల్లో చేరుతుంటారు. సాధారణ రోజుల్లో 130నుంచి 150 వరకు కేసులు ఉంటాయి. OP సంఖ్య 500 నుంచి 600 వరకు నమోదవుతూ ఉంటుంది. ప్రతి నెల 300 నుంచి 350 ప్రసవాలు జరుగుతుంటాయి. వీటితోపాటు 100 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు ఇక్కడి వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్యశాలను 150 పడకల ఆసుపత్రిగా మార్చింది. ఇందులో భాగంగా 21కోట్ల రూపాయలతో 100 పడకలున్న పాత భవనాల ఆధునీకరణతోపాటు, 50 పడకల అదనపు భవన నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ మేరకు నూతన భవన నిర్మాణానికి 2022లో శంకుస్థాపన జరిగింది. అయితే 50 పడకల భవన నిర్మాణం ఏడాదిగా సాగుతుండగా పాతభవనం ఆధునీకరణ పనులూ నత్తనడకన కొనసాగుతున్నాయి.
డాక్టర్ గోఖలే బృందానికి సహకరించని జీజీహెచ్.. శస్త్ర చికిత్సలు చేయలేమని..
'పార్వతీపురం జిల్లా ఆసుపత్రి (Hospital) ప్రస్తుతం వంద పడకల వైద్యశాలగా కొనసాగుతోంది. ఎండోస్కోపీ, ఐసీయూ, నవజాత శిశు కేంద్రం, పౌష్టికాహార కేంద్రం, రక్తనిల్వ కేంద్రం, సిటీ స్కాన్ వంటి ఆధునిక సేవలు వైద్యశాలలో అందుబాటులోకి వచ్చాయి. కానీ అవసరానికి తగ్గ పడకలు లేవు. అందుబాటులో ఉన్న 100 పడకల భవనం అసౌకర్యంగా ఉంది. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. రోగులకు చెందిన పలు వార్డులు సైతం పైకప్పు చెమ్మపట్టాయి. వైద్య నిపుణుల కొరత సమస్యగా మారింది. దీంతో సాధారణ రోగాలతో పాటు కాన్పులు, సాధారణ శస్త్రచికిత్సలు మాత్రమే చేస్తున్నారు. రోగుల (patients) సహాయకులకు సదుపాయాలు లేక ఆరుబయట ఉంటున్నారు.' -రంజిత్ కుమార్, గిరిజన సంఘం నేత, శ్రీదేవి, లక్ష్మి, పార్వతీపురం