Mangalagiri Police Try To Search in Nandigam Suresh House : వైఎస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ నివాసంలో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సురేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు చేసేందుకు వెళ్లారు. కానీ ఇంట్లో పెద్దవారెవరూ లేకపోవడంతో సోదాలు చేయలేదు.
పోలీసులు నందిగం సురేష్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఆయన భార్య బేబీ లత, అన్న వెంకట్ లేకపోవడంతో తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇంట్లో పిల్లలు తప్ప పెద్దవారు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చారు. పెద్దవాళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇద్దరు సీఐలు, ఎస్సై, పది మంది కానిస్టేబుల్స్ సురేష్ ఇంటికి వెళ్లారు.
మహిళ హత్య కేసు నిందితుల జాబితాలో నందిగం పేరు - Nandigam Suresh remand
రిమాండ్ పొడిగింపు :తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 2 రోజుల విచారణలో భాగంగా బాపట్ల మాజీ ఎంపీకి 45 ప్రశ్నలు వేసి పోలీసులు సమాచారం రాబట్టారు. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాధానం చెప్పారని సమాచారం.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఉందని, దానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిపించారని, అందుకే తాను ఆరోజు అక్కడికి వెళ్లానని నందిగం సురేష్ పోలీసులకు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి కుట్ర జరిగిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్- 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి - Nandigam Suresh to police custody
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 23 మంది అరెస్ట్ : 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా, వైఎస్సార్సీపీ పాలనలో విచారణ ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ తీవ్రం చేశారు. దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి 23 మందిని అరెస్టు చేశారు. వారిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు.
YSRCP LEADERS : అరెస్టు భయం - కోర్టు తీర్పు రావడమే ఆలస్యం, అబ్‌స్కాండ్ అయ్యారా? స్టేట్ దాటి వెళ్లారా? - YSRCP LEADERS ARREST FEAR