Mana Illu Old Age Home Launched by Kakinada District Youngster: కన్నవారినే పట్టించుకోని వాళ్లు ఉన్న ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్న ప్రతి అవ్వ, తాతలకు ఆత్మ బంధువు అవుతున్నాడు ఆ యువకుడు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా సేవలో పెద్ద మనసు చాటుకుంటున్నాడు. "మన ఇల్లు" అంటూ వినూత్న ఆశ్రమం కల్పించి సహృదయంతో పెద్దలకు సేవలు చేస్తున్నాడు. సేవే అసలైన అభిమతం, మానవత్వం అంటున్న కాకినాడ యువకుడు సత్యనారాయణ స్ఫూర్తి కథ ఇది.
సేవ చేయాలన్న తపన ఉండేలే కానీ ఆదాయంతో పని లేదని నిరూపిస్తున్నాడీ యువకుడు. దిక్కులేని స్థితిలో ఆసుపత్రుల్లో, రోడ్లపై పడి ఉన్న పెద్దవాళ్లను ఆదుకున్నాడు. మిత్రులు, తెలిసిన వారి సాయంతో వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేసి అండగా నిలబడ్డాడు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ధైర్యంగా నిరాశ్రయులకు సేవలు అందిస్తున్నాడు.
'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన
కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన ఆ యువకుడి పేరు వీర వెంకట సత్యనారాయణ. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి కుటుంబ పోషణ కోసం ఓ కొరియర్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయడం ఇష్టం. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే సామాజిక అంశాలు స్ఫూర్తి కల్పించేలా ఇతడిని ప్రేరేపించాయి.
ఓ రోజు మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు సత్యనారాయణ. అక్కడ ఓ వృద్ధురాలు అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతోంది. బాగోగులు చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. విషయం తెలుసుకుని చలించిపోయాడు సత్యనారాయణ. ఆమెకు తనవంతు సాయం చేసినా అప్పటికే ఆరోగ్యం విషమించడంతో చనిపోయింది. ఆ సమయంలో అనాథగానే వెళ్లిపోతున్నాను అన్న ఆ వృద్ధురాలు మాటలు సత్యనారాయణను కదిలించాయి.
"ఓ ఆస్పత్రిలో వృద్ధురాలు చనిపోయే ముందు ఎలా బతికిన చివరికీ వృద్ధాశ్రమంలోనే చనిపోతున్న అని నాతో చెప్పింది. ఆమె బాధను చూశాకే నాకీ మన ఇల్లు పెట్టాలనే ఆలోచన వచ్చింది. అవ్వ తాతలు వృద్ధశ్రమంలో ఉంటున్నామనే ఆలోచన రాకుండా సొంత ఇంటిలో ఉంటున్నట్లు ఇక్కడ ఏర్పాట్లు చేశాం. స్నేహితులు, తెలిసిన వారు అండగా నిలబడుతున్నారు. దాతలు, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం చేస్తే మరింత మందికి సేవ చేస్తా" - సత్యనారాయణ, మన ఇల్లు నిర్వాహకుడు