తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాతో దిగిన ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్​స్టాలో పెడతా' : బాలికకు మైనర్ వేధింపులు

ఇన్‌స్టాగ్రామ్​లో పరిచయమై సరదాగా ఫొటోలు దిగిన అమ్మాయి - ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ డబ్బులు కొట్టేసిన వైనం

Morphing Photos Blackmails
Man Blackmails a Girl in Instagram (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Man Blackmails a Girl in Instagram: సోషల్‌ మీడియా వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ఇన్​స్టాగ్రామ్​లో అమ్మాయిలను పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో ఫొటోలు తీసుకొని, వాళ్ల దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఏపీలోని ఒంగోలు జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయిన అమ్మాయితో ఫొటోలు దిగి, ఆ తర్వాత వాటిని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ డబ్బులు కాజేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం : వారిద్దరూ మైనర్లు. ఒకరికొకరు ఇన్‌స్టాగ్రామ్​లో పరిచయమయ్యారు. ఆ తర్వాత కలిసి బయట సరదాగా ఫొటోలు దిగారు. అప్పటి నుంచి అతను తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. తనకు కొంత డబ్బు కావాలని, లేకుంటే ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.

దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా వారు దాచిన డబ్బు తీసి అడిగినంతా అతనికి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ అతను పలుమార్లు ఆమెను బెదిరింపులకు గురి చేసి సొత్తు రాబట్టుకుని జల్సాలకు వాడుకున్నాడు. ఇంట్లో దాచిన డబ్బులు తరచూ మాయమవుతుండటంతో ఎవరు తీస్తున్నారో అని తల్లిదండ్రులు నిఘా పెట్టారు. తమ కుమార్తే డబ్బు తీస్తుందని తెలుసుకొని షాక్ అయ్యారు. ఆమెను గట్టిగా నిలదీశారు.

దీంతో తనకు మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన బాలుడితో ఇన్‌స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడిందనీ, అతను తన ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తుండటంతో డబ్బులు తీసుకెళ్లి ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో జాగ్రత్తలు : సోషల్ మీడియాలో పరిచయమైన వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరితోనూ ఫొటోలు షేర్ చేసుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలను ప్రొఫైల్ పిక్​గా పెట్టొద్దని, కచ్చితంగా ప్రొఫెల్ లాక్ పెట్టుకోవాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దని, ఇతర వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడొద్దన్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియో చాట్స్​ను షేర్ చేయొద్దని పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం - పని ఇస్తానని గదికి రప్పించి అఘాయిత్యం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం - యువకుడి ట్రాప్‌లో బాలిక - కట్​చేస్తే హోటల్​ గదిలో 20 రోజులుగా బందీ - Girl Captive in the Hotel Room

ABOUT THE AUTHOR

...view details