Hyderabad Leaders Names in Cabinet Expansion :త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్గాలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలలో రేవంత్‌రెడ్డి కేబినెట్లో వీరెవరికి చోటు దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఒకరికి స్థానం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 స్థానాలు ఉండగా, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ నుంచి వీర్ల శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నార్యాయణరెడ్డి మాత్రమే గెలుపొందారు. వీరిలో వీర్లపల్లి శంకర్, నారాయణరెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. మల్‌రెడ్డి మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. దీంతో పార్టీలో తానే సీనియర్ కాబట్టి తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సైతం కలిశారు. దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కూడా రెండు మూడుసార్లు కలిశారు.