Sankranti in Konaseema : "ఆయ్! మేం గోదారోళ్లమండి" అనే మాటను చాలాసార్లు వినే ఉంటారు. వెటకారం అంటే గోదారోళ్లు, గోదారోళ్లంటేనే వెటకారం గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్లకు ప్రేమాభిమానాలతో పాటు వెటకారం కూడా ఎక్కువే. ఎటకారం ముందు పుట్టి గోదారోళ్ల తర్వాత పుట్టారేమో అనిపిస్తుందంటే నమ్మొచ్చు. వెటకారం లేకుండా వీళ్లకు మాట రాదు. మాటల్తో మైమరపిస్తారు. గోదారోళ్ల స్లాంగ్ (యాస)కు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. వెటకారంతో పాటు వీరికి ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే. ఎవరైనా కొత్త వాళ్లు వచ్చి అడ్రస్ అడిగితే చాలు దగ్గరుండి మరీ దిగబెడతారు.
సంక్రాంతి పండగ ఏపీలో ఎంతో ప్రత్యేకం. పండుగ రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడి గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇళ్లలో పసందైన వంటకాలకు తోడు ఊళ్లలో కోడి పందేలు, ప్రభలు, డాన్స్ పోటీలు, రికార్డింగ్ డాన్సులు, ఆర్.కె.స్ట్రా గానా, భజానాతో పాటు గుండాటలు, సినిమాలు ఇలా మూడు రోజుల సమయం అంతా మూడు క్షణాల్లో గడిచిపోయేలా అనిపిస్తుంది.
'సంక్రాంతికి వస్తున్నాం' - 'ఓ సామాన్యుడి స్టోరీ' చదివేయండి!
రికార్డింగ్ డాన్సులు, ప్రభలు
తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, లోల, కాకినాడలో పి.నాయకంపల్లి, రావులపాలెం, మగతపల్లి, తూర్పుపాలెం, కారవాక, కేసనపల్లి, నాగుల్లంక, జగ్గంపేట, మేడపాడు, రాజోలులో రికార్డింగ్ డాన్సులు ఎంతగానో అలరిస్తాయి. వీటిని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. అవిడి, జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం వేడుకలో లక్షలాదిగా పాల్గొంటారు.
కోడి పందేలకు కేరాఫ్
కోడి పందేలు ఎక్కువగా భీమవరం, అమలాపురం ఎంతో ప్రత్యేకం. వెంప, ఐభీమవరంలో జరుగుతుంటాయి. పెద్ద పెద్ద మైదానాల్లో, ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రీడా పోటీల నిర్వహణను తలపిస్తాయి. పల్నాడు బ్రహ్మనాయుడు యుద్ధకాలంలో కోడి పందేలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య శాంతి స్థాపన కోసం మొదటిసారిగా కోడి పందేలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహాయుద్ధాలు అనివార్యమైనపుడు ప్రాణ నష్టం జరగకుండా నివారించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఇరు పక్షాల నుంచి కోళ్లను ఎంపిక చేసి వాటి మధ్య పోటీ పెట్టి విజేతలను నిర్ణయించడం పరమార్థం.
రాత్రి 11 అయ్యిందంటే చాలు
భీమవరం, వెంప, ఐ.భీమవరంలో నిర్వహించే కోడి పందేలు, కొత్తపేటలో మందుకలుపు(బాణ సంచా), జగ్గన్నతోటలో ప్రభల తీర్థం, ఆత్రేయపురంలో బోట్ రేసింగ్ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5లక్షల మంది పాల్గొంటారు. ఇసకేస్తే రాలనంతగా జనం తరలివస్తారు. రాత్రి 11 నుంచి 2గంటల వరకు ఆర్ కె స్ట్రా ఉర్రూతలూగిస్తుంది. డాన్స్ బేబీ డాన్స్, రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలతో సమయం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.
ఆ మూడు విషయాల్లో టాపర్స్
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అత్యంత ఇష్టమైన విషయం ఎంటర్టైన్మెంట్. సినిమాలు, ఫుడ్, రాజకీయాలు వీళ్లకు ఇష్టమైన రంగాలు. పల్లెటూళ్లలో రచ్చబండ దగ్గర జరిగే రాజకీయ చర్చ అంచనాలకు అందదు.