Building Construction and Layout Regulations Changed: నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలపై ఏపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇళ్లు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన అవరోధంగా మారిన నిబంధనలను సడలించింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్-2017లో సవరణలు చేస్తూ వేరువేరుగా జీవోలు ప్రభుత్వం జారీ చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశారు. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ ప్రభుత్వం సవరణ చేసింది. 500 చదరపు మీటర్లు పైబడిన స్థలాల్లో నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లు తొలగింపు చేశారు. స్టేట్, నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన తొలగించారు.
బహుళ అంతస్తుల బిల్డింగ్లకు సెట్ బ్యాక్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సంక్రాంతి కానుకగా డెవలపర్లు, బిల్డర్లు, రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు మార్పులు చేస్తూ జీవోలు జారీ చేసింది. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామన్నారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇప్పటికే పలు సంస్కరణలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేసింది. 15 మీటర్ల కంటే ఎత్తైన బిల్డింగ్లకు సంబంధించి లైసెన్సుడ్ సర్వేయర్లు ప్లాన్ను రుసుము చెల్లించి ఆన్లైన్లో పెడితే అనుమతి వచ్చినట్టే అని స్పష్టం చేశారు. ఈ ప్లాన్లో ఎక్కడ డీవియేషన్లు ఉన్నా సదరు సర్వేయర్ లైసెన్సు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా సవరణ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. లేఅవుట్లలో ప్లాన్ అప్రూవల్ కోసం నుంచి నెలల తరబడి వేచి ఉండకుండా సింగిల్ విండో విధానం తీసుకురానుంది.
నెలలపాటు నిరీక్షణకు చెక్ - భవన నిర్మాణదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం