Speaker Ayyanna Patrudu Comments on Jagan: అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు అనడం వింతగా ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. దిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.
జగన్ చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అని స్పీకర్ అయ్యన్న ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయమే తనకూ కావాలని జగన్ అడుగుతున్నారని, ఏ రూల్ ప్రకారం జగన్‌కు ఆ అవకాశం ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. జగన్ ప్రతిపక్ష నేత కాదని, అంతే కాకుండా ఆ హోదాకు తగిన సంఖ్యా బలం వైఎస్సార్సీపీకి లేదనేది జగమెరిగిన సత్యమని అన్నారు. కానీ ఇదంతా జగన్‌కు తెలియకపోవడమే బాధాకరమని అన్నారు. చట్టాలు, రూల్స్ జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. చట్టాలు, నిబంధనలు మార్చి జగన్‌కు సమయం ఇవ్వలేం కదా అని అయ్యన్న చురకలంటించారు.
అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ అయ్యన్న తెలిపారు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారని వివరించారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వైఎస్సార్సీపీలో మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం జగన్ ఇవ్వాలని, వారి వారి నియోజకవర్గాల సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలని అన్నారు. సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కోరారు. అసెంబ్లీ హాజరు జాబితాలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ నేతల మాటలు వింతగా ఉన్నాయి. చంద్రబాబుకు ఇచ్చే సమయమే తనకూ ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. అసలు జగన్‌కు ప్రతిపక్ష నేత హోదానే లేదు. జగన్ అసెంబ్లీ నిబంధనలు తెలుసుకుని మాట్లాడాలి. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని లేఖ ఇవ్వాలి. సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారు. సభకు వచ్చి మాట్లాడాలని జగన్, వైఎస్సార్సీపీ నేతలను కోరుతున్నా.- అయ్యన్నపాత్రుడు, స్పీకర్
జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో ట్విస్ట్ - ఆన్లైన్ చీటింగ్ కేసులో మహిళ అరెస్టు