Mahesh Kumar Goud will Take Charge as PCC President : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు గాంధీ భవన్ ముస్తాబవుతోంది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తుండడంతో ఆ మేరకు పోలీసు శాఖ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గాంధీభవన్‌లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరొకవైపు శాంతిభద్రతలు, ట్రాఫిక్ పరంగా ముందస్తు చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పదవీ బాధ్యతలు తీసుకునే సమయంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి చర్చించారు. గన్‌పార్క్ దగ్గర నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా ఏ విధంగా ర్యాలీని గాంధీభవన్ వరకు వచ్చేట్లు చూడాలనే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు : రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మహేశ్‌కుమార్ గౌడ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గన్‌పార్క్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఒంటిగంటకు బయలు దేరి గాంధీభవన్ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కొత్తగా నియామకమైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.