Vanasthali National Park : కొందరు కబ్జాదారులు ఏకంగా జాతీయ పార్కునే విక్రయించారు. తక్కువ ధరకే స్థలాలిస్తామంటూ మోసాలకు పాల్పడి, కోట్ల రూపాయలను జేబుల్లో వేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. అదే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని వనస్థలిపురం వద్ద ఉన్న జాతీయ పార్క్ హరిణ వనస్థలి. దీనికై కొత్త అంశాలు సైతం వెలుగు చూస్తున్నాయి.
కొందరు నాలుగైదేళ్లుగా పార్కు స్థలాన్ని తొంభై గజాలు, అరవై గజాలు చొప్పున విక్రయిస్తున్నారని రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. యూనస్ ఖాన్, సుల్తానాలు తక్కువ ధరలకే స్థలాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే వేల మందికి ఈ స్థలాన్ని విక్రయించారని, అసలు ఈ హరిణ వనస్థలి జాతీయ పార్కు 582 ఎకరాలుంటే, నాలుగింతలు అంటే 2,400 ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు చేశారని వారు ఆధారాలు సేకరించారు.
తప్పుడు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా ఆక్రమణ :హరిణ వనస్థలి పార్కున్న ప్రాంతమంతా ప్రైవేటు పట్టాభూములదంటూ కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించారు. 1336 ఫసలీ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హనీఫాబీ అనే మహిళను ప్రభుత్వ భూములకు కస్టోడియన్‌గా నియమించిందన్నారు. ఈ భూముల్లో కొన్నింటిని అటవీశాఖకు లీజుకు ఇచ్చారన్నారు. ఆ భూములను అటవీశాఖ అధికారులు వెనక్కి ఇవ్వకుండా వారే కబ్జా చేశారంటూ సదరు వ్యక్తులు ఈ పత్రాలను కొనుగోలుదారులకు చూపించి, విక్రయిస్తున్నారు.