Mahashivratri At Kadile Papahareshwar Temple : పాపాలను కడతేర్చి మోక్షం కల్పించే మహా పుణ్య క్షేత్రం కదిలి పాపహరేశ్వరాలయం. ఏటా శివరాత్రి పర్వదినాన ఆ ప్రాంతం భక్తుల రాకతో జనసదోహంగా మారుతుంది. ఆ స్వామి దర్శనానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
కదిలి పాపహరేశ్వర ఆలయానికి 400 ఏళ్ల ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ గుడి నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో కొలువైన కదిలిలో కొలువై ఉంది. ఆనాడు పరుశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాపవిముక్తి కోసం కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విమోచనం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు పాపవిముక్తి పొందడంతో ఈ ప్రాంతం కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.
Kadile Papahareshwar Temple in Nirmal :ఈ ఆలయం ముఖద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఈ ఆలయ సమీపంలో ఋషి గుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఋషి గుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువుదీరడం ఈ ఆలయానికి మరోా ప్రత్యేకత. అన్నపూర్ణమాత కొలువైనందున సంవత్సరంలో 365 రోజుల పాటు నిత్యాన్నదానం కొనసాగుతుంటుంది.
'కదిలి గ్రామంలోని పాపహరేశ్వరాలయం పురాతన ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజున సాయంత్రం గణపతి దేవుడితో కార్యక్రమం ప్రారంభమై, మహాశివరాత్రి రోజున స్వామి వారికి అభిషేకాలు చేస్తారు. అదే రోజు రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరుగుతుంది. గుడి చుట్టూ స్వామి వారి పల్లకి సేవ ఉంటుంది.' - ఆలయ పూజరి