Maha Shivratri Special Shiva Lingam: సంక్రాంతి తరువాత వచ్చే అతి ముఖ్యమైన హిందూ పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెలలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి రోజును మాస శివరాత్రిగా పిలుచుకుంటాం. అయితే మాఘ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మహా శివరాత్రిగా జరుపుకుంటాం. శివరాత్రికి భక్తులు ఎంతో నియమ నిష్టలతో జాగారం చేస్తారు. మహాశివుడిపై భక్తిని పలువురు భక్తులు వివిధ రూపాలలో చూపుతుంటారు. అందుకు నిదర్శనమే గుంటూరులోని 1008 కిలోల శివలింగం. దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
5 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో: మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పేరేచర్ల కైలాసగిరి క్షేత్రం ఉత్సవ కమిటీ 1008 కిలోలతో శివలింగాన్ని తయారు చేశారు. అయితే దీనిని లడ్డూ బూందీతో తయారుచేయడం దీని స్పెషల్. 5 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో దీనిని రూపొందించినట్లు తెనాలి మిర్చి స్నాక్స్ నిర్వాహకులు తెలిపారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని వ్యాపార కేంద్రం వద్ద దీన్ని ప్రదర్శించడంతో ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పెన్సిల్‌పై శివతాండవం:మరో భక్తుడు, పెన్సిల్ మొనపై శివతాండవాన్ని చెక్కారు. సాధారణంగా మనం పెన్సిల్ చెక్కి దాంతో బొమ్మలు గీస్తాం. కానీ, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొననే బొమ్మగా మలిచారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని తాండవం చేస్తున్న శివుడి రూపాన్ని పెన్సిల్ మొనపై ఎంతో అందంగా చెక్కారు. 8 మిల్లీమీటర్ల వెడల్పు, 18 మిల్లీమీటర్ల ఎత్తున్న ఈ మినీ శిల్పాన్ని చెక్కేందుకు 10 గంటల సమయం పట్టిందని వెంకటేష్ తెలిపారు.