తెలంగాణ

telangana

ETV Bharat / state

మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?

Maha Shivaratri 2024 : హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఆ రోజున దేశంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. అయితే.. పరమశివుడిని ఎలా ధ్యానించాలో మీకు తెలుసా?

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 12:12 PM IST

Maha Shivaratri 2024
Maha Shivaratri 2024

Maha Shivaratri 2024 :పరమశివుడికి మహాశివరాత్రి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ పర్వదినం కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రతినెలలో మాస శివరాత్రి వస్తుంది. కానీ, మహా శివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వచ్చింది. తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున భక్తులంతా ఉపవాసం, జాగరణ ఉంటారు. మహాశివుడిని ఇలా పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి :
మహశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి (స్ఫటిక లింగమైనా/వెండి లింగమైనా) శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం కలుగుతుందని అంటున్నారు.

ఉద్యోగం, వ్యాపారంలో విజయం కలగాలంటే :
కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంత మంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు.

ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే :
ఆర్థిక సమస్యలున్నవారు మహశివరాత్రి రోజున సాయంత్రం శివుడికి జమ్మి ఆకులు, రుద్రాక్ష మాలను సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ పరమ శివుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని అంటున్నారు.

జాగరణ సమయంలో :
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఉదయాన్నే నిద్రలేవాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి శివ లింగానికి పాలు, చందనం, నెయ్యి, పంచదారతో అభిషేకం చేయాలి. రాత్రి జాగరణ ఉండేవారు శివ పురాణం, శివ సహస్రనామం వంటి వాటిని చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. వీరిపై ఎల్లప్పుడూ ఆ పరమ శివుడి అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఐదు శివరాత్రులు :
మహా శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించినా.. అలాగే ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా, రెండూ తనకి సమానమే అని ఆ పరమ శివుడు అంటాడు. హిందూ సంప్రదాయాల ప్రకారం.. నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని చెబుతారు. నిత్య శివరాత్రి అంటే రోజూ శివుడిని పూజించడం. పక్ష శివరాత్రి అంటే ప్రతి మాసంలో వచ్చే శుక్ల, బహుళ చతుర్దశి రోజున ఆ శివుడిని ఆరాధించడం. మాస శివరాత్రి అంటే నెలలో బహుళ చతుర్దశి రోజున ఆ దేవదేవుడిని అర్చించడం. అలాగే.. మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహా శివరాత్రిగా శివపురాణం పేర్కొంటోందని పండితులు చెబుతున్నారు. సాధకుడు తన యోగ మహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారని ప్రసిద్ధి.

వసంతి పంచమి స్పెషల్ ​- సరస్వతీ దేవికి ఇష్టమైన ప్రసాదాలు ఇవే!

మహా శివరాత్రి ఎప్పుడు? - ముహూర్తం, ఉపవాసం ప్రాముఖ్యత!

పెళ్లైన స్త్రీలు పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? - శాస్త్రం ఏం చెబుతుంది!

ABOUT THE AUTHOR

...view details