Magic Camera in Drone Summit : ఫొటోలు జీవితంలో భాగమైపోయాయి. సందర్భం ఏదైనా క్షణాలను బంధించేయాల్సిందే. మొబైల్‌లో ఫొటో తీసుకుంటే స్క్రీన్‌పై మాత్రమే చూడగలం. అదే చిత్రం సెకన్లలో చేతికి వస్తే వినడానికే ఆశ్చర్యకరంగా ఉంది కదూ! ఇలాంటి పరికరమే అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో దర్శనమిచ్చింది. అద్దంలా ఉండే బాక్సు ముందు నిల్చుంటే చాలు 10 సెకన్లలో ఫొటో కాపీ అరచేతిలో ఉంటుంది. ఆ మ్యాజిక్ కెమెరా ఎలా పని చేస్తుంది దాని విశేషాలేంటో చూసేద్దాం రండి.
రెండ్రోజులపాటు జరిగిన అమరావతి డ్రోన్ సమ్మిట్ వినూత్న ఆలోచనల ప్రదర్శనకు వేదికైంది. డ్రోన్ సమ్మిట్‌కు అనేక రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు వచ్చారు. వేల మంది ప్రజలు తరలివచ్చారు. డ్రోన్ షో, విభిన్న రకాల డ్రోన్ విన్యాసాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆనంద క్షణాలను వారికి జీవితాంతం పదిలంగా ఉంచేలా నిర్వాహకులు వినూత్న ఆలోచన చేశారు. దానికోసం సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. అదే మ్యాజిక్ కెమెరా.
10 సెకన్లలో అరచేతికి ఫొటో కాపీ :అద్దం బాక్సులా కనిపిస్తున్నదే మ్యాజిక్ ఫొటో కెమెరా. బాక్సు ఎదురుగా నిల్చుంటే చాలు స్మైల్ ప్లీజ్ అంటూ ఫొటో తీసి 10 సెకన్లలో కాపీ చేతికొస్తోంది. ఫొటోను ఫ్రేమ్‌లో పెట్టి మరీ ఉచితంగా అందించి ఆకట్టుకున్నారు. డ్రోన్ ప్రదర్శనలు చూసేందుకు వచ్చిన వారంతా మ్యాజిక్ కెమెరా వద్ద చిత్రాలు దిగేందుకు పోటీపడ్డారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఫొటో దిగుతూ హర్షం వ్యక్తం చేశారు.