Lovers Suicide on Railway Track in Guntur Dist :వారిద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్న వారు పెళ్లితో ఒక్కటై కలకాలం కలిసి జీవించాలని ఆశపడ్డారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరూ వాళ్ల చేతులపై పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నారు. ప్రేమ, పెళ్లి గురించి పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఒప్పుకోలేదు. తమ కల నెరవేరదని భావించారు. కలసి ఉండడం కష్టమని అనుకున్నారు. ఇక చేసేదేమీ లేక లోకాన్నే వీడి వెళ్లిపోయారు. రైలు కిందపడి సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.
రైల్వే పోలీసులు, స్థానికులు, బంధువుల కథనం ప్రకారం పెదకాకానికి చెందిన దానబోయిన సాంబశివరావు, సామ్రాజ్యం చిన్న కుమారుడు మహేష్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు వెంకయ్య (లేటు), విజయల చిన్న కుమార్తె శైలజ (20) రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సెల్ షోరూంలో పని చేశారు. వారి పరిచయం ప్రేమగా మారింది. కొన్ని నెలల కిందట ప్రేమ విషయం వారు పెద్దలకు చెప్పగా పెళ్లికి నిరాకరించారు. అతను డిప్లమో చేయగా ఆమె ఇంటర్ చదువుకుంది.
ఇటీవల శైలజ గుంటూరు వచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా, మహేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. యువతి స్థానికంగా గది అద్దెకు తీసుకొని ఉంటోంది. మహేశ్ కొన్ని రోజుల కింద ఇంటి నుంచి బయటకు వచ్చి ఆమెతో కలిసి ఉంటున్నారు. కుమారుడు ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో ‘మహేష్ నీకు నచ్చినట్లు, నువ్వు చెప్పినట్లు చేస్తాను’ అని తండ్రి వాయిస్ మెసేజ్ పంపారు. ‘నేను శుక్రవారం సాయంత్రం వస్తాను’ అని మహేశ్ సమాధాన సందేశం ఇచ్చారు.