Liquor Shops Applications Deadline Over in AP: రాష్ట్రంలో ఈ రోజు రాత్రి 7 గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటి వరకూ మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 85 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 1800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3379 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. ఈ నెల 14వ తేదీన లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయించనుంది. అక్టోబరు 15 తేదీ నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీ శాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో నోటిఫై చేసిన 113 దుకాణాలకు 5700 కుపైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల నుంచి సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు క్రోడీకరిస్తున్నారు. ఇంకా గడువు ముగిసే సమాయానికి 90 వేల దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల కోసం రిజిస్ట్రేషన్లు ముగిసినా రాత్రి 12 గంటల్లోగా డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆన్లైన్లో మద్యం దుకాణాలకు దరఖాస్తు దాఖలయ్యాయి. తమ అనుచరులు వేసే మద్యం టెండర్లకు కొంద మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీజులు చెల్లిస్తున్నారు.