Diwali Festival2024 Celebrations : వెలుగు దివ్వెల దీపావళి చీకటిని పారదోలే పర్వదినం. లోకమంతా వెలుతురు పంచే ఈ పండుగ రోజున నరకాసురుడి వధతో దుష్ట సంహారం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో మంచి జరగాలని అమాస చీకట్లు దూరమై అసలైన వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించే మంచి వేడుక ఇది. ముంగిట్లో చేరే మతాబులు కాకర పూవొత్తుల కాంతులు భూచక్రాల గింగిరాలు టపాకాయలు శబ్దాలతో ఊరూవాడా అసలైన సందడి కనిపిస్తుంది.
చీకటిపై వెలుగులు, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన ఈ పర్వదినం మన జీవితాల్లోని ఎత్తుపల్లాలు, కష్టనష్టాలతో పోల్చి చెబుతారు. అందుకనే ఈ దీపావళి నుంచే అందరి జీవితాల్లో మంచి మార్పు మొదలవ్వాలని ఆశిద్దాం. ఇన్నాళ్లూ అలముకున్న చెడును దూరం చేయడంతో పాటు మనకు ఒనగూరే మేలును ఈ దీపాల పండుగ సందర్భంగా మనసారా ఆహ్వానిద్దాం.
జాగ్రత్తలతోనే తీపి గుర్తులు :దీపావళి అంటే నోరు తీపి చేసే పర్వదినం. అయినప్పటికీ చాలా మంది నోరురించే మిఠాయిలను తినలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ నోట్లో పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు. చాప కింద నీరులా మధుమేహం(డయాబెటిస్) విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. మారుతున్న లైఫ్స్టైల్లో భాగంగా ప్రతి 8 మందిలో ఒకరు వ్యాధి బారిన పడుతున్నారు.
33 లక్షలకు పైగా ఉన్న జనాభాలో 5 లక్షలకు పైగా మంది షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఆహారం, వ్యాయామాల విషయంలో క్రమశిక్షణతో ఉండకపోవడం. ఒత్తిడికి లోను కావడం వల్ల ఈ సమస్య నెలకొంటోంది. ఈ దీపాల పండుగ రోజున ఆరోగ్యపరమైన జాగత్త్రలను తీసుకోవాల్సిన అవసరంపై ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి.
పర్యావరణ మేలు కోరి :భారీ బాణాసంచా మోతల కన్నా వెలుగులు విరజిమ్మే గ్రీన్ క్రాకర్స్‌ను(హరిత క్రాకర్ల) ఉపయోగిస్తే పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు. భారీ శబ్దాలతో చెవులకు 160కి పైగా డెసిబుల్స్ తీవ్రత తాకడం కన్నా 110-125 డెసిబుల్స్ మాత్రమే వచ్చే హరిత క్రాకర్లను పర్వదినాన కొనుగోలు చేసుకుంటే మేలు. ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న 4 లక్షల మందికి ఇబ్బంది తప్పడంతో పాటు కొత్తగా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.
పొదుపు మంత్రం పాటిద్దాం :దీపావళి పర్వదినం రోజు ఇళ్లను, దుకాణాలను శుద్ధి చేసుకుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. జీవితం సాఫీగా సాగాలంటే ఆర్థిక భరోసా చాలా అవసరం. అందుకనే ప్రతి ఒక్కరూ సంపాదనలో కచ్చితంగా 10 నుంచి 20 శాతం డబ్బులను పొదుపు చేయాలి. పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను అలవర్చాలి. యువత ఆర్భాటాలకు పోయి ఉప్పుల్లో కూరుకుపోతున్నారు. లోన్ యాప్‌ల వల్ల సగటున నెలలో ఇద్దరు, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలున్నాయి. లక్ష్మీ పూజలు చేయడమే కాదు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక క్రమశిక్షణను కూడా అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యంతోనే అసలైన వేడుక : సెల్‌ఫోన్ మితిమీరి వాడకం అనవసరమైన ఆలోచనలు, ఆందోళనకు కారణమవుతోంది. రీల్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా రోజులో అధిక బాగం సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. సగటున ఒక్కొక్కరు 3 నుంచి 5 గంటల పాటు దీన్ని ఉపయోగిస్తుండటంతో కంటి సంబంధిత సమస్యలతో పాటు మెడ నొప్పి కొనితెచుకుంటున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ మితిమీరిన సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలి. అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలి.
దీపావళి తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు!
దీపావళి వేళ సామాన్యులు కన్నీళ్లు - టపాసుల్లా పేలుతున్న నిత్యావసర ధరలు