Leopard in Tirupati :తిరుపతిలోని శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. భయంతో సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది. రెండ్రోజులుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల సమయంలో చిరుత పులి శ్రీవారి మెట్టు వద్ద సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. దాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారన్నారు. వెంటనే అటవీ అధికారులకు టీటీడీ సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద సంచరిస్తున్న చిరుతను చూసి కుక్కలు వెంబడించాయని.. వాటిపై దాడి చేయడానికి చిరుత పరిగెత్తిన దృశ్యాలు సీసీ కెమెరాలలో కనిపించాయన్నారు. అయితే చిరుత రాత్రి పూట సంచరిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. చిరుత సంచారంతో టీటీడీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు కాలినడకన పంపిస్తున్నారు.