Complaint against Mani Annapureddy:న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డి పై హైకోర్టు న్యాయవాది వి.వి. లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మణి అన్నపురెడ్డి విదేశాల్లో ఉన్నారని గతంలో సీబీఐ హైకోర్టుకు తెలిపిందన్నారు. అతనికి నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకుంటున్నామని గతంలో సీబీఐ తెలిపింది.
సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలి: మణి అన్నపురెడ్డి పేరు మార్చుకుని ఇండియాకు వచ్చి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని లక్ష్మీనారాయణ ఆరోపించారు. సీఎం జగన్, విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలను కూడా ఫిర్యాదులో జత చేశారు. జడ్జిలను దూషించిన వ్యవహారంలో గతంలోనూ హైకోర్టుకు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు పై అప్పట్లో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వెంటనే మణిని అరెస్టు చేయాల్సిందిగా, సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కోరారు.
ఇదీ జరిగింది: న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ, వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకుగాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబరులో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి, ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారంట్ సైతం తీసుకుంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎంఎల్‌ఏటీ (మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ), ఇంటర్‌పోల్ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చేసి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు? ఎందుకు అరెస్టు చేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.