Lanka Villages Still in Flood Water at Konaseema District : గోదావరి తగ్గుముఖం పట్టినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ముంపునకు గురైన గ్రామల ప్రజలకు అధికారులు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 29 వేల ఎకరాలు నీటిపాలయ్యాయి. 2వేల ఎకరాల విస్తీర్ణంలో వరిచేలు నీటమునిగాయి. దాదాపు 6వేల ఎకరాల ఉద్యానపంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.
ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods
వరదలో పడవలే దిక్కు : ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు ముంపులోనే మగ్గుతున్నారు. గ్రామాల్లోని రహదారుల్లో నడుము లోతుల్లో వరద నీరు నిలిచిఉంది. ప్రజలు, విద్యార్థులు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తాగునీరు, ఇతర నిత్యావసరాల కోసం పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. గౌతమి గోదావరి నది పాయలో వరద ప్రవాహం తగ్గినా అక్కడి ప్రజలకు వరద ముంపు వీడలేదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు.
విలవిలలాడుతున్న లంక గ్రామాలు : పి.గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వీరంత పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారెజీ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. సముద్రంలోకి 12.95 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు.