Land grabs in Bhogapuram: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆ పార్టీ అగ్ర నాయకులు, వారి అడుగులకు మడుగులొత్తే సీనియర్ అధికారులు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని భూములపై కన్నేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం రానుండటంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. పైగా అమాయక ప్రజలు, ప్రశాంత వాతావరణం ఉండటంతో భూచోళ్ల కళ్లు ఈ భూములపై పడ్డాయి.
విమానాశ్రయ చుట్టుపక్కల భూములను చేజిక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. మండలంలోనే అసైన్డ్ భూముల వివరాలు సేకరించి అనుభవదారులను మభ్యపెట్టి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డి-పట్టా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, తర్వాత రూపాయి కూడా రాదంటూ లబ్ధిదారులను బెదిరించి తక్కువ ధరకే కొట్టేస్తున్నారు. కంచేరు, కంచేరుపాలెం, రెడ్డి కంచేరు, ముంజేరు, రామచంద్రపేట, బసవపాలెం గ్రామాల్లో పేదల డి-పట్టా భూములను స్వాధీనం చేసుకున్నారు.
చావనైనా చస్తాం కానీ, భూములు వదులుకోం: విశాఖ భూ బాధితులు - LAND GRAB IN VISAKHA
ప్రధానంగా ప్రభుత్వ భూములు, డి-పట్టా భూములున్న కోస్టల్ కారిడార్‌పై భూబకాసురులు గురి పెట్టారు. రెండేళ్ల క్రితం సీనియర్ IAS అధికారిణి రహస్యంగా ఈ ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించారు. ఆ తర్వాత మరికొందరు సీనియర్ IAS అధికారులు ఎప్పటికప్పుడు రహస్య పర్యటనలు జరుపుతున్నారు. భోగాపురం మండలానికి సరిహద్దులోని విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద 318 ఎకరాల ప్రభుత్వ, డి-పట్టా భూములు ఉన్నట్లు గుర్తించారు. ఓ ప్రముఖ హోటల్ నిర్మాణానికి అనువుగా 40 ఎకరాలు సేకరించేందుకు రైతులను కలిసి భూములు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు ఉన్న త్రిలోక్ అనే వ్యక్తి దీనిలో మధ్యవర్తిత్వం నడుపుతున్నారు. కంచేరు రెవెన్యూలోని ప్రభుత్వ భూములు కలిగి ఉన్న రైతులను కలిసి మంతనాలు సాగిస్తున్నారు. భూ వ్యవహారాల గురించి ఈ ప్రాంతంలోని ఓ రిసార్ట్‌లో ఆయన 14 నెలలు బస చేసినట్లు సమాచారం. విశాఖలోని బీచ్‌రోడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ రహదారి చుట్టుపక్కల భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగింది.