CASES ON VALLABHANENI VAMSI: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. భూకబ్జా ఆరోపణలతో గన్నవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులోని రూ.10 కోట్ల విలువైన తమ స్థలాన్ని కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి భార్య సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం ఆక్రమణకు గురైందని 2024 జులై 15వ తేదీన నిర్వహించిన ప్రజాదర్భార్‌లో ఇచ్చిన ఫిర్యాదు కూడా వారి దృష్టికి వచ్చింది.
దీనిని పరిశీలించి కేసు నమోదు చేయాలని పోలీసులను అప్పట్లోనే కలెక్టరు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై బాధితురాలు సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. గతంలో స్థలం కబ్జాపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని, తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సాగించిన అక్రమ మైనింగ్, భూకబ్జాలు, బెదిరింపులు, ఆర్ధిక నేరాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తరుణంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏలూరు రేంజ్ ఐజీ ఐవీజీ అశోకుమార్ అధిపతిగా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలు కొమ్మా ప్రతాప్‌శివకిషోర్, డి.నరసింహకిషోర్‌ను సభ్యులుగా సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ ఏర్పాటైన మర్నాడే గన్నవరం నడిబొడ్డున జరిగిన భూకబ్జాపై వచ్చిన ఫిర్యాదుకు పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. వంశీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నమోదైన సెక్షన్లలో 352, 420, 467, 468, 471, 506, 120b ఉన్నాయి.
వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు:మరోవైపు కిడ్నాప్ కేసులో వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. బాధితుడు సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. వంశీని వైద్య పరీక్షల కోసం భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వంశీని తరలిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. వంశీని విచారించేందుకు కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది.