CREDAI former national chairman Interview :హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్(స్థిరాస్తి) రంగం పాతికేళ్లలో ఎంతో ఎదిగింది. అవ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ఈరంగం గత కొన్నేళ్లుగా వ్యవస్థీకృతంగా మారడంలో క్రెడాయ్ కృషి ఎంతో ఉంది. మొదట్లో చిన్న చిన్న ప్రాజెక్టులకే పరిమితమైనటువంటి మన బిల్డర్లు ఇప్పుడు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు. మున్ముందు హైదరాబాద్ నగరంలో రియాల్టీ మరింత పెరిగేందుకు, నగరం విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి' అని క్రెడాయ్ వ్యవస్థాపక సభ్యులు, జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. క్రెడాయ్ ఏర్పాటై 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి.
క్రెడాయ్ ప్రస్థానం ఎలా మొదలైంది?
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ఏర్పాటైన 1999కి, రెండు సంవత్సరాల ముందే బిల్డర్స్ ఫోరాన్ని రిజిస్టర్ చేశాం. ఆర్గనైజింగ్ మెంబర్లందరం దిల్లీలో, ఇతర నగరాల్లో కలుసుకునేవారం. పలు సమస్యలను చర్చించుకునే వాళ్లం. అలా నాసిక్‌లో మీట్ అయినప్పుడు క్రెడాయ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చింది. దాని వ్యవస్థాపక సభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా చేశాను. సాధారణంగా రెండు టెర్మ్స్ ఉపాధ్యక్ష పదవి ఉంటుంది. నేను 7 సార్లు చేశాను. అనంతర కాలంలో జాతీయ అధ్యక్షుడిని అయ్యాను. ఈ ప్రయాణంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీవోలు), జర్నలిస్ట్‌లతో కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్మాణ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. అందరితో కలిసి చేసిన పాతికేళ్ల ప్రస్థానం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
హైదరాబాద్ రియాల్టీలో నిబంధనలకున్న ప్రాధాన్యం?
నగరాలకు వలసలు క్రమంగా పెరగడంతో 90వ దశకం ఆఖరులో ప్రైవేటు రంగంలో హౌస్ కన్స్ట్రక్షన్ మొదలైంది. అవగాహన తక్కువ రూల్స్ ఉల్లంఘనలు ఎక్కువ. ఇవి 100 నుంచి 150 వరకు ఉండేవి. బిల్డర్లు ఎక్కువగా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో రూల్స్ పాటించేటట్లయితేనే క్రెడాయ్‌లో సభ్యులుగా చేరాలని చెప్పాం. నిశితంగా పరిశీలించి మెంబర్లుగా చేర్చుకున్నాం. స్వీయనియంత్రణను పాటించాం. అయితే రూల్స్ పాటించి నిర్మిస్తే బిల్టప్ ఏరియా విస్తీర్ణం తక్కువ వస్తుందని భూ యజమానులు డెవలప్‌మెంట్‌కు ఇచ్చేవారు కాదు. ఈ క్రమంలోనే చాలా నష్టపోయాం. నిబంధనల్లో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించాం. 95 శాతం ఉల్లంఘనలే ఉంటున్నాయంటే తప్పు ఉల్లంఘించే వారిది కాదని రూల్స్(నింబంధనలు)దే అని అర్థమై ప్రభుత్వానికి విన్నవించాం. కాలానుగుణంగా వాటిలో మార్పులను తీసుకొచ్చాం.
నిర్మాణ నాణ్యత పరంగా ఎలాంటి మార్పులు వచ్చాయి?
ఒకప్పుడు మన బిల్డర్లు 20 నుంచి 50 ఫ్లాట్ల నిర్మాణాలను చేపట్టేవారు. 100 పైన నిర్మించే సంస్థలు చాలా తక్కువగా ఉండేవి. భవనాల ఎలివేషన్, కారిడార్ లాంటి కామన్ ఏరియా, ల్యాండ్‌స్కేపింగ్ డిజైనింగ్‌లో చాలా వెనకబడి ఉండేవారు. అంతకు ముందు వరకు నగరంలో గృహకల్ప, బాబుఖాన్ ఎస్టేట్ వంటి కొన్ని భవనాలు మాత్రమే బహుళ అంతస్తులవి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ 500, వెయ్యి యూనిట్ల ప్రాజెక్ట్‌లు కట్టడం, ల్యాండ్‌స్కేపింగ్ లాంటివి బాగా చేస్తుండటం వల్ల మనవాళ్లలోనూ మార్పు వచ్చింది. వారిని చూసి నేర్చుకుని పెద్ద ప్రాజెక్ట్‌లు చేపట్టడం మొదలెట్టారు. క్వాలిటీ కూడా పెరిగింది. ఇప్పుడు ఆకాశహర్మ్యాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపడుతున్నారు. దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడి నిర్మాణాలు, వాటిలోని సౌకర్యాలు చూసి తమ దగ్గర ఈస్థాయిలో లేవని అసూయ పడేలా మనవాళ్లు నిర్మిస్తున్నారు.