తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బోనాల వేడుకలు - భారీ సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు - Lal Darwaja Bonalu 2024 - LAL DARWAJA BONALU 2024

Lal Darwaja Bonalu 2024 : రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. మహిళా లోకం నెత్తిన బోనమెత్తి సల్లంగ సూడమ్మ అంటూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించింది. ఉదయం నుంచే బారులు తీరిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు.

Lal Darwaja Bonalu 2024
Lal Darwaja Bonalu 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 9:38 PM IST

Lal Darwaja Bonalu 2024 : రాష్ట్రవ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. కుంకుమ, పసుపులతో అలంకరించిన బోనాన్ని శిరస్సుపై పెట్టుకుని ఆపై దీపాన్ని వెలిగించి అందులో నైవేద్యాన్ని ఆడపడుచులు అమ్మవారికి సమర్పించారు. పిల్ల పాపలను సల్లంగ సూడమని వేడుకున్నారు. వానలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా ఉండాలని ప్రతి ఇంటా పసిడిసిరులు కురవాలని కోరుకున్నారు.

Celebrities visited Goddess Mahankali :రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఆరోగ్యం, అభివృద్ధి, శాంతిని ప్రసాదించాలని అమ్మవారిని గవర్నర్ ప్రార్థించారు. బోనాల పండుగను పురస్కరించుకొని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలుసుకున్నారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా :పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి బోనాల పండుగన్న భట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పించామన్నారు.

బోనాల కార్యక్రమంలో ప్రముఖులు :హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా జంట నగరాల్లోని ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు.

నాచారంలోని మహంకాళి అమ్మవారికి జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఆ పార్టీ నేత మాధవీలత మొక్కులు చెల్లించుకున్నారు. అంబర్‌పేట్‌ మహంకాళి అమ్మవారి ఆలయంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

పలుజిల్లాలో ఘనంగా బోనాల వేడుకలు :రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైతం బోనాల వేడుక కట్టిపడేసింది. ఆషాడ మాసం ముగింపు వేళ కరీంనగర్‌లోని పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. డప్పు చప్పుళ్లతో బోనాలు నెత్తిన పెట్టుకొని కాలినడకన ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శివసత్తుల పూనకాలతో బైండ్ల వారి నృత్యాలతో పురవీధుల గుండా బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.

నిర్మల్ బంగల్ పేట్ మహాలక్ష్మి , ఖిల్ల మైసమ్మ, ఎల్లమ్మ ఆలయాకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి , రామకృష్ణాపూర్ పట్టణాల్లో సింగరేణి కార్మిక కుటుంబాలు బోనాలు ఎత్తుకొని శోభయాత్ర చేపట్టాయి. మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయానికి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details