Special Story in Kumki Elephants : జనావాసాల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసం, ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తున్న గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమికొట్ట గలిగే కుంకీ ఏనుగులు త్వరలోనే ఏపీకి రానున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందినవాటిని కుంకీ ఏనుగులుగా పరిగణిస్తారు. అటవీ ఏనుగులను మచ్చిక చేసుకోవడం, తరిమేయడం, మదమెక్కి ఉన్నవాటిని శాంతింపజేయడం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడే కుంకీ ఏనుగులను పట్టుకోవడం మొదలు వాటి శిక్షణ, ఆపరేషన్లలో వినియోగం వరకూ ప్రతి దశా ఆసక్తికరమే.
తక్కువ వయసున్న మగ ఏనుగులనే :అడవిలో తిరిగే ఏనుగుల గుంపు నుంచి వేరుపడి ఒంటరైన, కొన్ని ప్రత్యేక లక్షణాలున్న గజరాజులను గుర్తించి వాటిని బంధిస్తారు. ఇందుకోసం తక్కువ వయసున్న, మగ ఏనుగులనే ఎంపిక చేసుకుంటారు. ఇటీవల కేరళలో ఒక ఆడ ఏనుగునూ కుంకీగా మార్చారు. పట్టుకున్నవాటికి శిక్షణ అందిస్తారు. వాటిని గుర్తించేందుకు ప్రత్యేక పేర్లు పెడతారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాలున్నాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనేవి కూడా ఇవే.
శిక్షణ పూర్తయ్యాక అడవిలోకి ఒంటరిగా వదిలేసి :అటవీ ప్రాంతాల్లోంచి బంధించి తీసుకొచ్చిన గజరాజులను శిక్షణ శిబిరాలకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో వాటిని పెడతారు. తొలుత ఏనుగులను శాంతింపజేస్తారు. వాటి ప్రవర్తనను బట్టి నెమ్మదిగా శిక్షణ మొదలుపెడతారు. మొదట మావటీలు వాటికి చేరువై వివిధ రకాల సంకేతాల్ని వాటికి అలవాటు చేస్తారు. అలా అలవాటయ్యాక చిన్న చిన్న ఆదేశాలు ఇవ్వడం మొదలుపెడతారు. వాటిని పాటిస్తే చెరకు, బెల్లం అందిస్తూ మచ్చిక చేసుకుంటారు. క్రమంగా మావటీలకు, ఏనుగులకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది.
ఆ తర్వాత కుంకీ ఏనుగులను ఎన్‌క్లోజర్ నుంచి బయటకు తెచ్చి అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ అడవి ఏనుగులు వీటిని చూసి కలవరపడుతున్నాయా? లేదా? వాటి ప్రవర్తన ఎలా ఉంది? తదితర అంశాలు గమనించి వెనక్కి తీసుకొస్తారు. శిక్షణలో ఈ కీలక దశ దాటాక వాటిని ఒంటరిగా అడవిలో వదిలేస్తారు. తిరిగి వాటంతట అవే శిక్షణ శిబిరానికి వచ్చేస్తే అవి పూర్తిగా కుంకీ ఏనుగులుగా మారినట్లే. వైద్యులు, అటవీ అధికారుల పర్యవేక్షణలో మూడు సంవత్సరాల పాటు ఈ కఠోర శిక్షణ ఉంటుంది.
మన రాష్ట్రంలోని ననియాలలో : ఆంధ్రప్రదేశ్‌లో 2006లో కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం ఏర్పాటైంది. కుప్పం అటవీ రేంజ్ పరిధిలోని ననియాలలో దీన్ని నెలకొల్పారు. వినాయక్, జయంత్ అనే రెండు కుంకీ ఏనుగులు ఇక్కడున్నాయి. దాదాపు 17 సంవత్సరాల పాటు ఇవి సేవలందించాయి. ప్రస్తుతం వృద్ధాప్యంలోకి వచ్చేశాయి. ఇక సేవలందించే స్థితిలో అవి లేవు. దీంతో మన రాష్ట్రానికి కుంకీ ఏనుగులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల కర్ణాటక అటవీశాఖను కోరారు. అందుకు వారు అంగీకరించారు. త్వరలో ఇవి ఏపీకి రానున్నాయి. వాటికి శిక్షణ ఇచ్చే మావటీలూ వాటితోపాటు రానున్నారు.