తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్ రెడ్డి "చలో దిల్లీ కాదు చలో పల్లె" చేపట్టాలి : కేటీఆర్ ట్వీట్ - KTR SLAMS CM REVANTH REDDY - KTR SLAMS CM REVANTH REDDY

KTR Slams CM Revanth reddy : సీఎం రేవంత్​కు దమ్ముంటే “చలో దిల్లీ” కాదని, “చలో పల్లె” చేపట్టాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని ఆయన ఆరోపించారు. గాడి తప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న విపత్కర పరిస్థితుల్లో, సీఎం ఉండాల్సింది దిల్లీలో కాదు, తెలంగాణ గల్లీల్లో అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on CM Delhi Tours
KTR Slams CM Revanth reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 4:34 PM IST

KTR Comments on CM Delhi Tours : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్​కు దమ్ముంటే “చలో దిల్లీ” కాదని, “చలో పల్లె” బాట చేపట్టాలని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే, వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా? అని నిలదీశారు.

పర్యటనలతో ప్రయోజనం శూన్యం : రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా? అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని ఆరోపించారు. సీఎం దిల్లీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. అన్నదాతలను ఆగంచేసి, దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రైతుల తండ్లాట తీర్చేది ఎవరు, రుణమాఫీ పూర్తిచేసేది ఎవరని అడిగారు.

రైతుల సమస్యలపై తీరిక లేదా :పార్టీ అధిష్ఠానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప, అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ ఆక్షేపించారు. రైతులకేమో మాయ మాటలు, దిల్లీ పెద్దలకు మాత్రం మూటలా అని తీవ్రంగా స్పందించారు. 20 సార్లు చేపట్టిన దిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది “గుండు సున్నా” అని ఎద్దేవా చేశారు. ఓ వైపు డెంగీ మరణాలు, మరోవైపు పెరుగుతున్న నేరాలు, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు అని పేర్కొన్నారు.

కుర్చీ లాగేయడం తథ్యం :గాడి తప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న విపత్కర పరిస్థితుల్లో, సీఎం, మంత్రులు ఉండాల్సింది దిల్లీలో కాదు, తెలంగాణ గల్లీల్లో అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి, అన్నదాతలను అరిగోస పెట్టి హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే, తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ, రాష్ట్ర పీసీసీ చీఫ్, నామినేటేడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. ఈపర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు ఉన్నారు.

కేశవరావు స్థానంలో వీహెచ్​కు ఆ పదవి ఇవ్వవచ్చు కదా? : కేటీఆర్ - KTR SLAMS CONGRESS ON RAJYA SABHA

అధికారుల వెంబడి కాదు మంత్రుల వెంట పడదాం - ఎవరికి ఓటేశామో వాళ్లనే అడుగుదాం : కేటీఆర్‌ - KTR ON LOAN WAIVER ISSUES

ABOUT THE AUTHOR

...view details