KTR Sent Legal Notices : ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో(Phone Tapping) తనపై అవాస్తవాలు ఆరోపిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR), పలువురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. వీరిలో దేవాదాయశాఖా మంత్రి మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు.
దానం విషయంలో ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి - లేదంటే హైకోర్టుకే : కేటీఆర్ - KTR ON DANAM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసినందుకు నోటీసులు పంపిన ఆయన, వారం రోజుల్లోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా, పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ముగ్గురు నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. మరికొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కేటీఆర్ మరోమారు నోటీసులు పంపించారు. సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.