KTR Questioned ED on X :కర్ణాటక వాల్మీకి కుంభకోణంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపంచారు. ఈ కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తెలంగాణలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు రహస్య లింక్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు.
కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌కు చెందిన 45 కోట్ల రూపాయలు బదిలీ అయిన హైదరాబాద్‌లోని తొమ్మిది మంది బ్యాంకు ఖాతాదారులు ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. నాలుగున్నర కోట్లు బదిలీ అయిన ఓ ఛానల్ యాజమాని ఎవరు అని ప్రశ్నించారు. సిట్, సీఐడీ, ఈడీ సంస్థలు ఇక్కడ దాడులు నిర్వహించారని, ఆ వార్తలు మీడియాలో రాకుండా ఎందుకు అణిచివేశారని కేటీఆర్ నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు విత్‌డ్రా చేసిన బార్‌లు, బంగారు దుకాణాలను ఎవరు నడుపుతున్నారని, కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
వాల్మీకి కుంభకోణంలో రూ.90 కోట్ల అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి ఎందుకు అన్నారని, దాని అర్థం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. విషయాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉందని, ఇక్కడ కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారో సమాధానాలు చెప్పగలరా అని ఈడీ డైరెక్టర్‌ను కేటీఆర్ అడిగారు.