KTR Fires On Rajiv Gandhi Statue : సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపాదించిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. తెలంగాణ పౌరుషం, వైభవాన్ని చాటేలా అద్భుతంగా నిర్మించిన సచివాలయం సమీపంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, పాలకులకు అమరవీరుల త్యాగాలను, స్ఫూర్తిని జ్వలింపజేస్తూ అమరజ్యోతి స్మారకాన్ని నిర్మించినట్లు వివరించారు.
తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లిని ఆ మధ్యలో ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతోందని మండిపడ్డారు. వందలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ, మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి, రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనరని, అతి పెద్ద అంబేడ్కర్‌కు కనీసం పూలదండ వేయరని, అమరజ్యోతిలోకి ఇప్పటి వరకు సందర్శకులను అనుమతించ లేదని ఆక్షేపించారు. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. గత పదేళ్లలో తాము ఏనాడూ పేర్ల మార్పుపై ఆలోచించలేదన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు.