KTR Attend Nampally Court: సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తనకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కలిగించాయని ఒక మహిళ పట్ల తనకున్న గౌరవంతో ఆమె చెప్పిన మాటలు తిరిగి చెప్పలేకపోతున్నానని కేటీఆర్ కోర్టుకు వివరించారు. కొండా సురేఖపై ఆయన వేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కోర్టుకు తన వాగ్మూలాన్ని వినిపించారు. ఆయనతో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.
నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం : మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనపై మంత్రి చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్ గురయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు.
వాగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. పిటిషన్లోనివి పరిగణలోకి తీసకోవాలని కోరారు. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు. నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు.