KRMB Allotted 14 TMC to Telugu States :నాగార్జునసాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్ కు 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల నాలుగో తేదీన కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కానందున ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో(Tri-Member Committee Meeting) తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు.
KRMB Meeting Over Water Crisis :అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా, అందులో తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా ఏడు టీఎంసీలు వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ(Engineer in Chief) పేర్కొన్నారు. సాగర్ నుంచి వెంటనే తమకు ఆ ఐదు టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ పేర్కొన్నారు.
శ్రీశైలం నుంచి ఏపీ ఏ అవసరలకు కూడా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. సాగర్ దిగువన తమకు తాగునీటికి(Drinking Water) చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్‌పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు.