Paddy Farmers Worried about Pengal Cyclone in AP :ఫెయింజల్ తుపాన్ ప్రభావం కారణంగా ధాన్యం రైతులు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలోని వరి కొతలు ముమ్మరంగా సాగుతుండటంతో చాలా చోట్లా ధాన్యం పట్టాలపై ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో బస్త్రాల నిల్వలు ఉన్నాయి. ధాన్యాన్ని విక్రయించాలంటే తేమ శాతం పేరుతో అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన ధ్యాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
అన్నదాతల ఆందోళన :ఈ ఏడాది కృష్ణా జిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 61,775 ఎకరాల్లో కోత కోశారు. 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు చేరింది. మరింత ధాన్యం రోడ్ల మీదే ఉంది. వాయుగుండం ప్రభావంతో కురిసిన చిరుజల్లులతో కల్లాల్లో ధాన్యం ఉండడంతో రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ఆ పంట నోటి దగ్గరకు వచ్చే సమయంలో వాతావరణంలో మార్పులు రావడంతో పాటు వివిధ ప్రాంతాల్లో చినుకులు కురవడంతో అన్నదాతలు భయపడుతున్నారు.
గత కొన్నేళ్లుగా ఇలాగే పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడం చూసి ప్రకృతి కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని అవేదన చెందుతున్నారు. పంటను ఎలా దక్కించుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. నేలవాలిన పైరు ఎక్కువ రోజులు కోయకుండా ఉంటే మొలకలు వచ్చే అవకాశండంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోసినా తేమశాతం నిబంధనతో కొంత మంది రైతులు ధాన్యాన్ని ఆరబెట్టగా మరికొందరు బస్తాల్లోకి ఎత్తి ఉంచారు. వర్షం పడితే పంట ఏమవుతుందోనని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని అన్నిచోట్లా ధాన్యం బస్త్రాల నిల్వలు ఉన్నాయి.
పుదుచ్చేరి-మహాబలిపురం దగ్గర తీరాన్ని తాకిన తుపాను - ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక
ఇబ్బందులు పెడుతున్న అధికారులు : గతేడాది డిసెంబర్లో వచ్చిన తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందని ముందస్తుగా వాతావరణశాఖ హెచ్చరించడతో జిల్లా వ్యాప్తంగా పంటను సంరక్షించుకునేందుకు కోతకు వచ్చిన వరి నూర్పిడిని యంత్రాలతో వేగవంతం చేశారు. తేమ శాతం తగ్గించేందుకు జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నూర్చిన ధాన్యం రాసులు ఆరబెట్టారు. జాతీయరహదారి 216, 65లపై విజయవాడ- మచిలీపట్నం, మచిలీపట్నం- అవనిగడ్డ, విజయవాడ - అవనిగడ్డ కరకట్ట రహదారిపై రోడ్లపై ధాన్యం రాశులు దర్శనమిస్తున్నాయి. చినుకు పడితే పంట చేతికి వచ్చే అవకాశం ఉండదని రైతులు భయపడుతున్నారు. పంటను అమ్ముదామంటే తేమ శాతం పేరుతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని అవేదన చెందుతున్నారు.
బస్తాకు రూ.300, రూ.350 వరకు కోత :ఇప్పటికే ఎకరానికి దాదాపు 35 వేలు ఖర్చు చేశామని, పంట చేతికి వస్తే చేసిన అప్పులు తీర్చుకుందామని ఎదురు చూస్తుంటే ఇప్పుడు తుపాన్ ప్రభావం తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని వాపోతున్నారు. తాము ధాన్యం తీసుకువెళ్లితే తేమ శాతం ఎక్కువ ఉందని, మద్దతు ధర ఇవ్వలేమని రైతు సేవా కేంద్రం అధికారులు అంటున్నారని తెలిపారు. పంట కొసి నాలుగైదు రోజులు అవుతుందని, అప్పటి నుంచి దాన్యాన్ని అరబెడుతున్నామని వివరించారు.
ప్రస్తుతం వాతవరణంలో మార్పులు వచ్చిన కారణంగా తమకు భయంగా ఉందన్నారు. చేతికి వచ్చిన పంట చేయ్యిజారి పోతుందని అనుమానంగా ఉందన్నారు. పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్లు కప్పుతున్నామని, అయినా చినుకును టార్పాలిన్లు ఎంత వరకు అపగలవని ప్రశ్నిస్తున్నారు. తుపాన్‌కు భయపడి ధాన్యం తక్కువ ధరకు అమ్ముదామంటే, తేమ పేరుతో అధికారుల ఇబ్బంది, దానికి తోడు రవాణా చేసేందుకు లారీలు కూడా అందుబాటులో లేవని రైతులు చెబుతున్నారు. మిల్లుల్లో ఖాళీ లేదని చెబుతూ తేమ శాతాన్ని పరిశీలించకుండానే బస్తాకు రూ.300, రూ.350 వరకు కోత పెడుతున్నారని రైతులు చెబుతున్నారు.
ఎగిసిపడుతున్న రాకాసి అలలు - కోత బారిన తీరప్రాంత గ్రామాలు
ప్రభుత్వం త్వరితగతిన ఆదుకోవాలి :పెడన, బందరు, గుడివాడ, పెనమలూరు, అవనిగడ్డ, పామర్రు ఇలా అన్ని నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు కోత కోశారు. అన్నిచోట్లా పంట కోత దశకు చేరుకుంది. వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో గత కొన్ని రోజులుగా రైతులు హడా వుడిగా యంత్రాలతో కోతలు కోసి విక్రయిస్తున్నారు. ఆకాశం మేఘావృతంగా ఉన్నా రైతులు కోతలు కోస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కూడా అవస్థలు పడాల్సి వస్తుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాన్ ప్రభావం వల్ల ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొలుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ధాన్యం తేమ శాతం కొంటాం : జిల్లాలోని పలు మండలాల్లో అరబెట్టిన ధాన్యంను టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ధాన్యం తడిసి పోకుండా టార్పాలిన్లు సమకూర్చాలని, మిల్లుల వద్ద ధాన్యం దిగుబడిలో ఆలస్యాన్ని నిరోధించాలని బందరు ఆర్డీవోను కోరారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ధాన్యం తేమ శాతం ఉన్న కొనుగోలు చేస్తుందని, ధాన్యం తడిసి పోకుండా మార్కెట్ కమిటీ గోదాముల వద్ద, ఖాళీ గోదాముల వద్ద తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ధాన్యం తడిసి పోకుండా తమకు టార్పాలిన్లు సమకూర్చాలని రైతులు కోరారు.
తిరుమలలో భారీ వర్షం - శ్రీవారి భక్తులకు ఆ మార్గాల్లో నో ఎంట్రీ