Konaseema Coconut Prices Hike: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ మార్కెట్‌లో కొబ్బరికాయల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెయ్యి కొబ్బరికాయల ధర 9 వేల రూపాయల నుంచి రెట్టింపై 15 వేలకు చేరింది. దీని గమనిస్తే కోనసీమ కొబ్బరికి మళ్లీ మంచి రోజులొచ్చాయనే చెప్పొచ్చు. గతంలో ధరలు ఉన్నప్పుడు దిగుబడి అంతగా ఉండేది కాదు. దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ లేక అమ్మకాలు నామమాత్రంగా ఉండేవి. కానీ ఈ సారి రెండూ ఆశాజనకంగా ఉండటం రైతులకు కలిసొచ్చింది. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో కురిడీ కాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో అక్కడకు ఎగుమతులు పెరిగాయి.
ఇదే సమయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కాయల ఉత్పత్తి తగ్గడం కూడా కొత్తకొబ్బరి, పచ్చి, కురిడీ కాయలు ధర పెరుగుదలకు దోహదం చేసిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వసంత పంచమి, మహాశివరాత్రి, హోలీ, శ్రీరామనవమి ఇలా వరుస పండగల నేపథ్యం కూడా ఎగుమతులకు ఊతం ఇచ్చింది. వసంత పంచమికి ఒడిశా రాష్ట్రానికి అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకూ కోనసీమ కొబ్బరి తరలివెళుతోంది.