Kodi Pandalu 2025 in AP :ఏపీలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. దీంతో కోళ్లు ఢీ అంటే ఢీ అంటూ సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడి రక్తం చిందించాయి.
వీటిని వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. నగదు తీసుకురాని వారి కోసం నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం కూడా కల్పించారు. సంక్రాంతి పండగ తొలిరోజున కోట్ల రూపాయలకు పైగా డబ్బులు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ ఔత్సాహికులు తరలివచ్చారు. మరోవైపు భారీ టెంట్లు వేసి పందేలతో పాటు గుండాట, ఇతర జూద క్రీడలు బహిరంగంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వేలకు వేలు పందేంగా కాస్తున్నారు.
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వచ్చి వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షిచేందుకు నిర్వాహకులు వివిధ ఏర్పాట్లు చేశారు. వారి కోసం వాహనాల పార్కింగ్, భోజనాలు, అత్యాధునిక వసతులతో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల గెలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తున్నారు. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో కోడి పందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.