MRPS Narender Kidnap Case In Rangareddy : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలోని రూ.కోట్ల విలువైన ఒక స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. దీనిపై మాట్లాడేందుకు గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు రామేశ్వరం నరేందర్, తన అనుచరుడు ప్రవీణ్ కుమార్‌తో కలిసి స్థలం దగ్గరికి రావాలని కోరారు. అక్కడికి వెళ్లిన ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్ సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కోసం ప్రయత్నించినా చిక్కలేదు. దీంలో కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
గాలింపు చేస్తున్న పోలీసులు వివాదానికి కారణమైన స్థలం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఓ ఖాళీ జాగాలో అలజడిగా ఉండటంతో పోలీసులు వెళ్లి అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. భూమి ఎవరిది? ఇక్కడ ఎందుకున్నారని అడుగుతున్న సమయంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపైకి కత్తులు, హాకీ కర్రలతో తిరగబడ్డారు. ఎదురు దాడిని ఊహించని పోలీసులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అదనపు బలగాలను రప్పించారు. దాంతో వారిని చూసి రౌడీలు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటపడిన పోలీసులు అహ్మద్‌ఖాన్, షేక్ హమ్దన్, మహ్మద్ జాఫర్, మసూద్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.