Khammam MP seat :ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు పోటీపడుతున్న ఆశావహుల జాబితా మరింత పెరుగుతోంది. ఇప్పటికే టికెట్ ఆశిస్తూ ముగ్గురు జిల్లాలకు చెందిన మంత్రుల కుటుంబీకులతో కలిపి 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత రేణుకా చౌదరి టికెట్ ఆశించినా అధిష్ఠానం ఆమెని రాజ్యసభకు పంపించడంతో బరి నుంచి తప్పుకున్నట్లైంది. ముగ్గురు మంత్రుల కుటుంబీకులు టికెట్ వేటలో ముందున్నారు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని తమకు అవకాశం కల్పించాలని కోరుతూనే దిల్లీ పెద్దలతో ఎవరికీ వారే మంతనాలు చేస్తున్నారు.
Congress Focus On Parliament Elections : వీవీసీ ట్రస్ట్ అధినేత రాజేంద్రప్రసాద్ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తమకు అవకాశం కల్పించాలంటూ సీనియర్ నేతలు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, కొత్తగూడెం నేత నాగ సీతా రాములు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా వి. హనుమంత రావు, జెట్టి కుమార్ సైతం ఇక్కడి నుంచే అవకాశం ఇవ్వాలని కోరుతుండటంతో టికెట్ ఎవరికీ దక్కుతుందన్నది హస్తం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటి మినహా మిగిలిన 9 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ మిత్ర పక్షం గెలుచుకుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 స్థానాలకుగానూ కొత్తగూడెంలో సీపీఐ, మిగిలిన 6 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయ బావుటా ఎగుర వేసింది.