TG Govt Floods Compensation :గత నెల ఆగస్టు 30, 31న ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వచ్చిన ఉపద్రవం ఊహించలేనిది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముంచెత్తిన వరదలతో వేలాది ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయారు. ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోయి ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని దాదాపు 15 కాలనీలు, ఖమ్మం గ్రామీణం మండలంలోని మున్నేరు, ఆకేరు ప్రభావిత ప్రాంతాలు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాలకు వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి.
బాధిత కుటుంబాల గుర్తింపు : వరద బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 16 వేల 500 రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఖమ్మం నగరంలోని డివిజన్లతో పాటు గ్రామాల వారీగా పరిహారం అందించేందుకు సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 15 వేల 258 బాధిత కుటుంబాలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా 10 వేల కుటుంబాలు ఖమ్మం నగరంలోనే నష్టపోగా, మిగతా 5 వేల మంది బాధితులు ఇతర మండలాల్లో ఉన్నారు.
పరిహారం కోసం ఎదురచూపులు : వారి ఖాతాల్లో పది రోజులుగా పరిహారం సొమ్ము జమ అవుతోంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 14 వేల 206 మంది ఖాతాల్లో 23 కోట్లకు పైగా జమ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా సుమారుగా 1000 మందికి మాత్రమే అందాల్సి ఉందని చెబుతున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం, పట్టణ, గ్రామీణం మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు బాధితులు పోటెత్తుతున్నారు. తమకు ప్రభుత్వ పరిహారం అందలేదంటూ అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు.
సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసినా ఇంకా పరిహారం అందలేదని కొందరు, అసలు తమ పేర్లే నమోదు చేసుకోలేదని మరికొందరు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. సర్వేకు వెళ్లిన సమయంలో బాధితులు ఇళ్ల వద్ద లేకపోవడం, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వకపోవడం, ఇళ్లు మునిగిన ఫోటోలు లేకపోవడం, ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో పరిహారం సొమ్ము అందలేదు. ఇక అద్దె ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.