Khairtabad Ganesh Height in 2024 : భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి ప్రత్యేకతే వేరు. దేశంలో గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.
అందుకే వినాయక చవితి అనగానే తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపయ్య. ఇక్కడ రాష్ట్రంలోన అత్యంత ఎత్తయిన, ఎంతో విశిష్టమైన గణపయ్య ప్రతి ఏటా కొలువుదీరతాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ రానుంది. గణేశ్ నవరాత్రుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటాం.
Khairtabad Ganesh Karra Puja 2024 :ముఖ్యంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడి లంబోదరుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొలువయ్యే ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులను ఇవాళ ప్రారంభించారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఖైరతాబాద్ గణేశ్ మండలి నిర్వాహకులు వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.