MLA Danam Nagender About Hydra Demolishes :చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో మూసీ నిర్వాసితులను తరలించేటప్పుడు కూడా అధికారులు ప్రజలకు నచ్చజెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్ మార్కులు తదితర అంశాలకు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ పరిధిలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్‌భవన్ ప్రాంతంలోని పార్క్ హోటల్‌కు శిఖం భూమిలో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాని పక్కనే మాజీమంత్రి కేటీఆర్ స్నేహితుడు, ఆయన బినామి ప్రదీప్‌రెడ్డికి చెందిన ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ పేరుతో శిఖం భూమిలో పది అంతస్తులకు అనుమతి ఎలా దక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఉంటున్న ఫాంహౌస్ కూడా ఆయన బినామి ప్రదీప్‌రెడ్డిదేనన్నారు. ఐమ్యాక్స్ థియేటర్ కూడా చెరువులోనే ఉందని తెలిపారు.
'బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్ మార్కులు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది' - దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే