Khairatabad Ganesh Nimajjanam 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు, గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య సాగర్ గర్భంలో నిమజ్జనమయ్యాడు. ఆ క్రతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీంతో నగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు.
కనులపండువగా శోభాయాత్ర :70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు, ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తయిన మట్టి గణపతిగా రికార్డుకు ఎక్కాడు. స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓవైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేయటం విశేషం.