ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బియ్యం దందా పేర్ని పన్నాగమే - రిమాండ్ రిపోర్ట్​లో కీలక విషయాలు - PERNI NANI RATION RICE CASE

రేషన్‌ బియ్యం మాయం కేసు - పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాత్మక విషయాలు

Perni Nani Ration Rice Case
Perni Nani Ration Rice Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 11:00 AM IST

Perni Nani Ration Rice Case : పేదల బియ్యాన్ని కొట్టేసిన పేర్ని నాని వాటిని ఏం చేశారో తెలిసిపోయింది. పౌరసరఫరాల శాఖ ఆధీనంలోని బియ్యాన్ని ఎలా మాయం చేశారు? ఎక్కడికి తరలించారు? ఎవరికి అమ్మారు? ఎంత సొమ్ము చేసుకున్నారు? ఆ దొంగ డబ్బుతో ఏం చేశారో పోలీసులు తేల్చేశారు. అన్ని వివరాలతో కోర్టుకు రిమాండ్‌ రిపోర్ట్ సమర్పించారు.

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేదలకు పంచాల్సిన రేషన్‌ బియ్యం అమ్మేసుకుని ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చుచేశారు. ఆయన తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్‌లో వ్యవస్థీకృతంగా ఈ దందా నడిపించారు. గోదాము మేనేజర్‌ బేతపూడి మానస్‌తేజను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు.

రేషన్‌ బియ్యం అమ్మినందుకు ఫోన్‌పే ద్వారా సొమ్ము చెల్లింపులు జరిగాయి. ఆ డబ్బంతా మానస్‌తేజ ద్వారా చివరికి పేర్ని నానికే చేరింది. ఈ అక్రమం బయటపడకుండా ఉండేందుకు గోదాము వద్దనున్న వేబ్రిడ్జిని ట్యాంపరింగ్‌ చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్​లో పేర్కొన్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన పేర్నిని ఆరో నిందితుడిగా (ఏ6) చేర్చారు. వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్యల వల్లే తమ వద్ద పౌరసరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం బస్తాల్లో తరుగు వచ్చిందని దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానంటూ జయసుధ నవంబర్ 27న కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాశారు.

Police Remand Report Perni Nani : జయసుధ రాసిన లేఖలో చెప్పిన విషయంలో నిజం లేదని పోలీసులు తేల్చారు. రేషన్‌ బియ్యం అక్రమరవాణా దందా వ్యవహారంలో చట్టం నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతో పేర్ని నానియే తన భార్య పేరిట ఈ లేఖ సమర్పించారని పేర్కొన్నారు. గోదాములో స్టాకు పరిశీలనకు వెళ్లిన ముగ్గురు సభ్యుల కమిటీకీ పేర్ని సహకరించలేదని గోదాము తాళాలు పగలగొట్టి వారు తనిఖీలు చేయాల్సి వచ్చిందని వివరించారు.

మొత్తం రూ.1.68 కోట్ల విలువైన 7577 బస్తాల రేషన్‌ బియ్యం తరలిపోయిందని తేల్చారు. మరోవైపు పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోదాముల నిర్మాణం 2022 మే నాటికే పూర్తయినట్లు చెప్పారు. కానీ ఆయన రాజకీయ పలుకుబడి ఉపయోగించి 2023లో తొలిసారి పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చారని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. గోదాము మేనేజర్‌ మానస్‌తేజను ఆరు నెలల క్రితమే నియమించుకున్నామంటూ జయసుధ జేసీకి రాసిన లేఖ కూడా తప్పుదోవ పట్టించడమేనని నిర్ధారించారు. వాస్తవంగా 2023 జనవరి నుంచి మానస్‌తేజ గోదాము మేనేజర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు వివరించారు.

పేర్ని నాని బియ్యం దొంగతనాన్ని గుర్తించిన పౌరసరఫరాల శాఖ సాంకేతిక విభాగం అసిస్టెంట్‌ మేనేజర్‌ చింతం కోటిరెడ్డిని పేర్ని ప్రలోభపెట్టారని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్​లో స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని బయటకు తరలించి అమ్ముకుంటున్నట్లు గుర్తించిన కోటిరెడ్డి దీనిపై మానస్‌తేజను ప్రశ్నించారు. పేర్ని ఆదేశాల మేరకే తరలిస్తున్నామని ఆయనకు చెప్పారు. ఆ తర్వాత కోటిరెడ్డితో మాట్లాడిన పేర్ని నాని అన్నీ తాను చూసుకుంటానని ఏమీ కాదని మంచి పోస్టింగ్ ఇప్పిస్తానంటూ ప్రలోభపెట్టినట్లు నిర్ధారించారు.

ఫోన్‌పే ద్వారా డబ్బు వసూలు : పేర్ని నాని ఆదేశాల మేరకు గోదాము మేనేజర్‌ మానస్‌తేజ, పెడన మండలానికి చెందిన లారీడ్రైవర్‌ బొట్ల నాగ మంగారావు, రైస్‌ మిల్లు లీజుదారుడు బొర్ర ఆంజనేయులు సాయంతో 3000ల బస్తాల రేషన్‌ బియ్యాన్ని అమ్మారు. వీటిని గూడురుకు చెందిన డొక్కు నాగరాజుకు కిలో రూ.18 చొప్పున అమ్మేసినట్లు పోలీసులు వివరించారు. దానికి సంబంధించి రూ.22.33 లక్షల సొమ్ము ఫోన్‌ పే ద్వారా మానస్‌తేజకు చేరేదని ఆయన ఆ నగదును పేర్ని నానికి అందజేసేవారని చెప్పారు. 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబర్ వరకూ ఫోన్‌పే చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఈ వివరాలన్నీ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్​లో ప్రస్తావించారు. అక్రమ రవాణాలో సహకరించినందుకు మంగారావుకు రూ.2.21 లక్షలు, ఆంజనేయులుకు రూ.1.03 లక్షల చొప్పున పేర్ని నాని చెల్లించారు.

రేషన్‌ బియ్యం మాయం కేసు - పేర్ని నానిపై కేసు నమోదు

రేషన్ బియ్యం కేసు - దూకుడు పెంచిన పోలీసులు - పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details